– సీఐ నుండి అదనపు భద్రత డీసీపీ వరకు..
– వివాదాలతోనే సాగిన తిరుపతన్న పోలీస్ హిస్టరీ
– ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర
– సదాశివపేటలో సీఐగా ఉన్నప్పుడు లాకప్ డెత్!
– నయీం డైరీలో తిరుపతన్న పేరు
– వివాదాల పోలీస్‌గా గుర్తింపు
Phone Tapping Tirupatanna : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బడా పోలీసుల పేర్లు బయటకొస్తున్నాయి. చేసిన పాపాలన్నీ వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతన్న పేరు తెరపైకి వచ్చి కటకటాలపాలయ్యాడు. ఈ అరెస్ట్ తర్వాత ఇతనెవరు..? ఇప్పటిదాకా ఏం చేశాడు..? ఇలా ఎన్నో అనుమానాల నేపథ్యంలో నెట్టింట శోధన మొదలైంది. ఈ క్రమంలో తిరుపతన్న పోలీస్ హిస్టరీని పసిగట్టారు కొందరు.
ఒక సాధారణ సీఐగా పని చేస్తూ తనకున్న వాక్చాతుర్యంతో పాటు అంగం బలం అర్థబలంతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులను సైతం తన గుప్పిట్లో పెట్టుకునేలా వ్యవహరించాడు. కోరుకున్నచోట పోస్టులు తెచ్చుకున్నాడు. తిరుపతన్న అంటేనే అవినీతికి వివాదాలకు కేరాఫ్ అని కొన్నాళ్లకే ఆయా వర్గాల్లో పేరు నానింది. 2007లో సదాశివపేటలో సీఐగా పనిచేస్తున్న సమయంలో చోరీ కేసులో అనుమానాస్పదంగా తీసుకువచ్చిన ఒక వ్యక్తి లాకప్ డెత్ అయ్యాడు. ఈ ఘటనతో సదాశివపేట వాసులు పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టారు. లాకప్ డెత్‌కు ప్రధాన కారణం తిరుపతన్న అని చెప్పుకుంటారు.
ఈ వ్యవహారం తర్వాత జిల్లా నుంచి బదిలీ చేసి పంపేశారు ఉన్నతాధికారులు. అయితే, ఎలాగైనా ఈ కేసును నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో తిరిగి పదోన్నతిపై డీఎస్పీగా జిల్లాకు వచ్చాడు. అంతే లాకప్ డెత్ కేసును క్లోజ్ చేయించి చేతులు దులుపుకున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ మాఫియా నయీం గ్యాంగ్ ఆగడాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. అయితే, తిరుపతన్న డీఎస్పీగా పదోన్నతి పొందిన కొద్ది రోజులకే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. డైరీలో సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న పేరు రెండో స్థానంలో ఉంది. ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. కానీ, ప్రభుత్వం దీన్ని మొదట్లో సీరియస్‌గా తీసుకున్నా, తర్వాత బడా రాజకీయ నాయకులు ఉండడంతో అర్ధాంతరంగా వదిలిపెట్టింది. దాంతో డైరీలో రెండవ జాబితాలో ఉన్న తిరుపతన్న ఊపిరి పీల్చుకున్నాడు.
సంగారెడ్డి డీఎస్పీగా పనిచేసి పదోన్నతిపై అదనపు డీసీపీ అయిన తిరుపతన్న ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ప్రణీత్ రావుకు సహకరించాడన్న పూర్తి సమాచారం మేరకు పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీం కేసులో తప్పించుకున్నా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం అరెస్టు కాక తప్పలేదు. ఉద్యోగం, చట్టాలనేవి పనికిరావు. డబ్బులు ఇస్తే చాలు చట్టాలను మార్చే శక్తి తిరుపతన్నకు ఉందని అంటుంటారు. దీనికోసం ఉన్నతాధికారులను సైతం మెప్పించే పనితనం ఆయనకే సొంతమని పోలీసుల విచారణలో బయటపడినట్టు సమాచారం.