Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజాగా నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అలాగే.. బీజేపీ సీనియర్ నాయకుడు అజ్మీరా ఆత్మారాం నాయక్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆత్మారాం నాయక్ రెండు సార్లు బీజేపీ టికెట్ పై పోటీ చేశారు. పార్టీలో చేరాక దీపాదాస్ మున్షి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
శంకరమ్మ పార్టీలో చేరిన సందర్భంగా గాంధీ భవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. శంకరమ్మ కుటుంబం తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ మరిచిపోదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, అమరులను విస్మరించదని తెలిపారు. శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్నవారిని చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని వివరించారు. హుజూర్ నగర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని తెలిపారు.
Also Read: రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ.. వీరి మధ్యే ఎన్నికలు
ప్రధాని నరేంద్ర మోదీ దిగజారి మాట్లాడుతున్నారని, అబద్ధాలు ప్రచారం చేసి గెలువాలని బీజేపీ, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. అదానీ కాంగ్రెస్ మనిషి అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
ఎన్నికలు పూర్తవ్వగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇల్లు కట్టే స్కీం కూడా మొదలు పెట్టామని ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి చెప్పారు. అర్హులైనవారందరికీ ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం నిరంతరం పారదర్శకంగా పని చేస్తున్నదని ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నామని చెప్పారు. ఒక చాంపియన్ క్రికెట్ టీమ్ తరహా 11 మంది మంత్రులు ఉన్నారని, కలిసి ముందుకు పోతున్నామని వివరించారు. పార్టీలో చేరినవారందరికీ స్వాగతం తెలిపారు.
పదేళ్లు పని చేసినా గుర్తింపు లేదు
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉన్నదని శంకరమ్మ తెలిపారు. పదేళ్లుగా ఆ పార్టీలో పని చేసినా గుర్తింపు లేదని, తనతోపాటు వందలాది మంది కార్యకర్తలది ఇదే పరిస్థితి అని వివరించారు. శ్రీకాంతాచారి కాలి ఉడికిపోతుంటే చూసి సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించిందని, సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.