Series Of meetings With CM and Top Leaders In Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా సాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. 100 రోజుల పాలన, హామీల అమలుపై హైకమాండ్‌కు రేవంత్ రెడ్డి వారికి వివరించారు. అలాగే పార్టీ బలోపేతం, నేతల చేరికలు, క్షేత్రస్థాయి రాజకీయ వాతావరణం గురించి సోనియాగాంధీతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 13 ఎంపీ అభ్యర్థుల ఎంపికపైనా ఆయన అధిష్ఠానంతో చర్చలు జరిపారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నేడు సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల ముందు జరగనున్న చివరి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావటంతో ఈ నేటి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పేద మహిళలకు లక్ష రూపాయల సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం, ప్రస్తుతం రిజర్వేషన్లకు ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని పెంచేందుకు రాజ్యంగ సవరణ చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్‌పైనా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగే అవకాశముంది.