Custody @ 2 Praneet Rao 2nd Day of Trial
Politics

Sensatinal News : రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు

Sensational Facts In The Remand Report : సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రణీత్‌ రావు రిమాండ్ రిపోర్టులో అనేక అంశాలను పొందుపరిచారు పోలీసులు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. చట్ట విరుద్ధంగా తాను చేసిన వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకే, హార్డ్‌ డిస్క్‌లను కట్టర్ల సాయంతో డిస్‌మ్యాండిల్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. 17 సిస్టమ్స్‌తో ఫోన్‌ ట్యాపింగ్ చేసిన ప్రణీత్, దీని కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

రేవంత్ రెడ్డిపై ప్రత్యేక నిఘా

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గా ఫోన్ల ట్యాపింగ్‌కి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కదలికలతో పాటు, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారనే డేటాను సేకరించాడు ప్రణీత్. ఆ మొత్తం సమాచారాన్ని ఓ బీఆర్‌ఎస్ నేతకు చేర వేసినట్లు తేల్చారు. ఆ బీఆర్‌ఎస్ నేత ఆదేశాలతో వంద నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిసింది.

డిసెంబర్ 4న డేటా ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని పర్సనల్ పెన్‌ డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నాడు ప్రణీత్. తర్వాత అక్రమాలు బయటపడకుండా హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశాడు. ఎన్నికల ఫలితాల తర్వాత డిసెంబర్ 4న రాత్రి డిస్క్‌లోని డేటా ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం వ్యవహరంలో ప్రణీత్‌ రావు మూడు రకాల నేరాలకు పాల్పడినట్లు తేలింది. సాక్ష్యాల చెరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రణీత్ రావు కింది స్థాయి సిబ్బందిని విచారించిన అధికారులు వారికి కూడా నోటీసులు అందించారు.

కేసును ఛేదిస్తున్న ప్రత్యేక టీమ్

ఇప్పటికే ప్రణీత్ ల్యాప్‌ టాప్, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసకున్న పోలీసులు, అందులోని చాటింగ్ సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని బయటకొచ్చాయి. ఈ కేసును ఛేదించేందుకు ఆరుగురు సభ్యులతో బృందం ఏర్పాటైంది. ఎవరి ఆదేశాల మేరకు ప్రణీత్ ఇదంతా చేశాడా? అని పోలీసులు కూపీ లాగుతున్నారు.

ప్రణీత్‌పై మరో ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్‌తో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రణీత్ రావుపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. తన ఫోన్ ట్యాప్ చేసి, తన కుటుంబసభ్యులను ప్రణీత్ మానసికంగా హింసించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిజానికి ప్రణీత్ పొలిటికల్ ఇంటెలిజెన్స్‌లో పని చేశాడు. ఇది మొదట సీఐసెల్ పర్యవేక్షణలో ఉండేది. తర్వాత, ఎస్ఐబీకి మార్చారు. 2018 నుంచి మొన్న సస్పెండ్ అయ్యే వరకు అందులో పని చేశాడు ప్రణీత్ రావు.