- సొంత పార్టీ నేతలపై పట్టు కోల్పోతున్న కేసీఆర్
- కీలక సమావేశాలకు హాజరు కాని నేతలు
- తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు
- పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశం
- సమావేశానికి గైర్హాజరైన కీలక నేతలు
- 130 మందికి గాను కేవలం 60 మంది మాత్రమే హాజరలు
- డుమ్మా కొట్టిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి
- అభ్యర్థి ఎంపిక విషయంలో తమని సంప్రదించలేదని అలక
- పార్టీ చీఫ్ ఆదేశాల ధిక్కరణపై నేతల అంతర్మథనం
BRS Party Latest news(Political news in telangana:
ఒకప్పుడు పార్టీలో ఆయన చెప్పిందే శాసనం..యావత్ బీఆర్ఎస్ పార్టీకి ఆయనో శిఖరం. ఆయనే గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ రాములు నాయక్ ను పార్టీ నుంచి గెంటేశారు. కుంభకోణం ఆరోపణలపై అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యను బర్త్ రఫ్ చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ ని కూడా దూరం పెట్టారు కేసీఆర్. అలాగే పార్టీ నిబంధనలు అతిక్రమిస్తున్నారని బాబూమోహన్ ను బయటకు వెళ్లేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ క్రమశిక్షణ పేరుతో చాలా మంది నేతలనే దూరం చేసుకున్నారు. వాళ్లందరిక చుక్కలు చూపించిన కేసీఆర్ ప్రస్తుతం పార్టీ వర్గాలపై పట్టు కోల్పుతున్నట్లు కనిపిస్తోంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని భావించి తెలంగాణ భవన్ లో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తల కీలక సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక ఈ పదిరోజుల్లో ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలు అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలు, ప్రణాళికలపై కీలక సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఉన్న 130 మంది ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అందరూ సమావేశం కావాలని ఆదేశించారు. అయితే ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. కేవలం 60 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే సగం కన్నా తక్కువే. గతంలో నాలుగు పర్యాయాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ కు ఈ ఊహించని షాక్ తగిలినట్లయింది.
ఝలక్ ఇచ్చిన మాజీలు
బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలను కూడా లెక్కచేయనంతగా తయారైన మాజీల తీరుతో కేసీఆర్ సైతం షాక్ కు గురైనట్లు విమర్శకులు చెబుతున్నారు. వాస్తవానికి మూడు ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కేవలం భద్రాచలం, స్టేషన్ ఘన్పూర్, జనగాం, సూర్యాపేట సెగ్మెంట్లలో మాత్రమే విజయం సాధించింది. ఉన్న ఈ నలుగురిలో భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతానికి జనగాం, సూర్యాపేటకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీలో ఉన్నారు. అయితే ఈ సమావేశానికి మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి వంటీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజు సారయ్య, కార్పోరేషన్ మాజీ ఛైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, నాయకులు బొల్లం సంపత్ కుమార్, వై. సతీష్ రెడ్డి తదితరులు రాలేదు. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి రాలేదు. ఉమ్మడి నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పలువురు సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు.
కీలక నేతల అలకలు
ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్ధి ఎంపిక సమయంలో సంప్రదించలేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి అలిగినట్లు సమాచారం. మళ్లీ అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ ఏకపక్ష ధోరణి అవలంబించారని..కనీసం మాటవరసకైనా తమతో చర్చించలేదని అలిగి ఈ ఇద్దరు నేతలూ సమావేశానికి దూరం అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కీలక నేతలు హాజరుకాకపోవడం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే సమస్యను పరిష్కరిస్తారా..? లేకుంటే చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ను నిలుపుకోవాలంటే నేతలను కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
నిస్సహాయ స్థితిలో కేసీఆర్
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. పార్టీలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే చర్యలకు ఉపక్రమించేవారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేవారు కాదు. క్రమశిక్షణను పదేళ్లపాటు పకడ్బందీగా అమలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీపై పట్టు కోల్పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నేతలు తమ వ్యవహార శైలితో లైన్ దాటుతున్నప్పటికీ కెసిఆర్ ఏమీ చేయలేకపోతున్నారు. జస్ట్ ఒక ప్రేక్షకుడిగా చూస్తుండి పోతున్నారు. అధికారం కోల్పోవడంతో కీలక నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమంది కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీ వీడుతుంటే.. కేసీఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు