Selection Of Candidates Is A Headache For KCR : పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలన్నీ ప్రిపరేషన్‌లో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్, బీజేపీకి ఈ విషయంలో ఇబ్బందేం లేదుగానీ, బీఆర్ఎస్‌కు మాత్రం ఈ అంశం తలకు మించిన భారంగా మారింది. కొత్తగా రిలీజ్ చేసిన అభ్యర్థుల ప్రకటనే ఇందుకు నిదర్శనం. ఇప్పటిదాకా ఐదుగుర్ని ఓకే చేసిన కేసీఆర్ కొత్తగా మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించారు.
మల్కాజ్‌గిరి నుంచి శంభీపూర్ రాజు, చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, మెదక్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తారని తెలిపారు. ఈ ఎంపిక ఆలోచించి చేశారా? అభ్యర్థులు దొరక్క జరిగిందా? అనే చర్చ అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మల్కాజ్ గిరి లోక్ సభ కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం. మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కుమారుడి కోసం ఎంతో ట్రై చేశారు.
Read More: అడ్డదారిలో పోస్టింగ్, సిట్ చేతికి ప్రణీత్‌రావు కేసు.!?
కానీ, చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. దీంతో అనూహ్యంగా శంభీపూర్ రాజును అదృష్టం వరించింది. కానీ, ఈయన ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. రంగారెడ్డి జిల్లాలో యూత్ లీడర్‌గా పలు హోదాల్లో కొనసాగారు. ఎమ్మెల్సీగా పని చేశారు. నిజానికి ఈయన ఎంపీ స్థాయి లీడర్ కాదనే చర్చ బీఆర్ఎస్‌లోనే జరుగుతోంది. చేవెళ్ల విషయంలోనూ ఇంతే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గూటికి చేరిన కాసానిని ఎంపిక చేశారు కేసీఆర్. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి ససేమిరా అనడంతో కాసానికి సీటు దక్కింది. ఈయన చేవెళ్ల నుంచి ఓసారి పోటీ చేశారన్న గుర్తింపు ఉంది కానీ, ఓట్లు దండుకునే సత్తా లేదనే టాక్ ఉంది. ఇక, మెదక్ నుంచి చాలామంది పేర్లే వినిపించినా చివరకు వంటేరును ఎంపిక చేశారు.
మొన్నటిదాకా ఆ సీటు గెలుస్తామన్న ఆశ గులాబీ శ్రేణులకు ఉంది. కానీ, వంటేరు ఎంపికతో అదికాస్తా చేజారే ఛాన్సు ఉందనే చర్చ మొదలైంది. ఇటు జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న అనిల్ కుమార్ పరిస్థితి ఇంతేనని, వీళ్ల ఎంపిక పార్టీకి నష్టమే చేకూర్చుతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బలమైన లీడర్లు పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో చేసేదేం లేక కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారు. మరోవైపు, బీఎస్పీ అంశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Read More: రేపే ఇఫ్తార్ విందు, హాజరుకానున్న సీఎం
పోటీకి అభ్యర్థులు దొరకకపోవడంతో ఆ పార్టీకి రెండు సీట్లను ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్‌తో పాటు ఆదిలాబాద్‌ను బీఎస్పీకి ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా హైదరాబాద్ స్థానంలో బీఆర్ఎస్ ఎప్పుడూ బలమైన అభ్యర్థిని నిలిపింది లేదు. ఇప్పుడు కూడా నిలిపే అవకాశం లేదు. మిగిలిన 16 స్థానాల్లో బీఎస్పీకి 2 సీట్లు పోగా మిగిలిన 14 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కేసీఆర్ పెద్ద యుద్ధమే చేశారు. ఇంకా కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు.