DGP Ravi Gupta: తెలంగాణ ఎన్నికల వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు డీజీపీ రవిగుప్తా వివరించారు. పార్లమెంటు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో భద్రత కోసం తెలంగాణకు 164 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను దింపినట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. ఎన్నికల సంఘానికి నిత్యం అందుబాటులో ఉంటామని, ఎన్నికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని వివరించారు.
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ దృష్ట్యా.. పరిస్థితులు కొన్ని చోట్ల గంభీరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్టు చేశారని అడగ్గా.. మావోయిస్టు ఎన్‌కౌంటర్ ప్రభావం ఉణ్న జిల్లాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీజీపీ రవిగుప్తా వివరించారు. ముఖ్యంగా కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలపై ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే.. రాజధాని నగరంలోని పాతబస్తీలోనూ వాతావరణం సున్నితంగా మారుతున్నది. అక్కడ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవిలత పోటీకి దిగిన తర్వాత హీట్ పెరిగింది. గతంలోనూ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘర్షణలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో పారా మిలిటరీ ఫోర్స్ వినియోగిస్తున్నట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు.
Also Read: హైదరాబాద్ టు విజయవాడ రూట్‌లో అదనంగా 140 బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కమిషనర్లు, ఎస్పీలతో జిల్లాల్లో ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని డీజీపీ రవిగుప్తా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని కంట్రోల్ రూమ్‌లో మానిటర్ చేస్తామని తెలిపారు. ఒక చోటుకు ప్రత్యేకంగా వెళ్లితే.. మిగిలిన చోట్లపై పర్యవేక్షణ కోల్పోయే ముప్పు ఉన్నందున తాను కంట్రోల్ రూమ్‌లోనే ఉండి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తానని వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగైతేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.