– మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లపై కాంగ్రెస్ గురి
– సీటు గెలిచి బీజేపికి షాక్ ఇవ్వాలని సీఎం వ్యూహాలు
– 5.3 లక్షల ముస్లిం, 1.6 లక్షల ఎస్సీ, లక్ష క్రైస్తవ ఓట్లే కీలకం
– బీఆర్ఎస్ ఓట్లను మరల్చుకునే వ్యూహంలో కాంగ్రెస్
– పాత కంచుకోటను హస్తగతం కానుందా?
Secunderabad Lok Sabha Constituency news(Political news in telangana): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ సీటును ఎట్టి పరిస్థితిలోనై చేజార్చుకోరాదని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయింది. తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకప్పటి తన కంచుకోటను తిరిగి సంపాదించాలనే పట్టుదలతో వుంది. ఒకప్పుడు ఈ స్థానం నుంచి పి. శివశంకర్, టంగుటూరి అంజయ్య, తర్వాతి రోజుల్లో ఆయన సతీమణి మణెమ్మ, పీవీ నరసింహరావు కుమారుడు రాజేశ్వర రావు, అంజన్ కుమార్ యాదవ్ వంటి ఎందరో కాంగ్రెస్ ఎంపీలుగా గెలిచి సేవలందించారు. బీసీలు, మైనారిటీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే వర్గాలుగా ఉన్నారు. అయితే, సామాజిక సమీకరణాల సాయంతో ఒకప్పటి తన కంచుకోటను తిరిగి హస్తగతం చేసుకునేందుకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేయటంతో ఈ సీటు తమ ఖాతాలోకి వచ్చి తీరుతుందని కాంగ్రెస్ కాన్ఫిడెంట్‌గా ఉంది.
ఈ ఎంపీ సీటు పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో సుమారు 20 లక్షల ఓట్లున్నాయి. వీటిలో 1.6 లక్షల ఎస్సీ, 5.3 లక్షల ముస్లిం ఓటర్లున్నారు. పైగా ఈ సీటు పరిధిలోని ఏడు స్థానాల్లో ఒకటైన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ను కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా బరిలో దించింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన దానం నాగేందర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఎంపీగా సీటు కూడా సాధించారు.
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య మంత్రివర్గ సభ్యుడిగా ఉన్న నాగేందర్‌కు కాంగ్రెస్‌తో బాటు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలుండటం, కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకులుగా ఉన్న ఎస్సీ, ముస్లిం వర్గాలతో బాటు బీసీల ఓటూ దానం నాగేందర్‌కు దక్కుతుందని, దీంతో సులభంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా పాతొచ్చని సీఎం ఆలోచనగా ఉంది. గతంలో దత్తాత్రేయ మూడు సార్లు గెలిచిన ఈ సీటు నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండటంతో ఈ సీటును హస్తగతం చేసుకోగలిగితే.. బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లవుతుందనే అంచనాతో సీఎం ప్రణాళికలు రచిస్తున్నారు.
Also Read:కవిత.. ఇదేం పని..? జడ్జి చివాట్లు..!
ఈ స్థానానికి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్‌కి 1,73,229 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 62,114 ఓట్ల మెజారిటీతో సికింద్రాబాద్‌ను కైవసం చేసుకుంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటులోని నాంపల్లి మినహా అన్ని సీట్లనూ బీఆర్ఎస్ కైవశం చేసుకుంది. వీటిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా నాగేందర్ ఉండటం ఒక సానుకూల అంశం కాగా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వంటి జనాదరణ గలిగిన నేతల మద్దతు కూడా తనకు అదనపు బలంగా మారనుందని కాంగ్రెస్ అంచనా వేసుకుంటోంది. దీనికి తోడు ఈ స్థానంలోని యాదవ, మున్నూరు కాపు, గౌడ, పద్మశాలి, తదితర బీసీ వర్గాలకు చెందిన 3 లక్షల ఓట్లతో బాటు లక్షకు పైగా ఉన్న క్రిష్టియన్ ఓట్లు, 5.3 లక్షల ముస్లిం ఓట్లతో సింహభాగం తనకే దక్కుతాయని, గతంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసిన తనకు అన్ని వర్గాల వారితో ఉన్న సంబంధాలు, కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలు, సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా తనకు భారీ మెజారిటీని తెస్తాయని నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టు తర్వాత సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్‌ఎస్ తరపున ఎవరూ పోటీ చేయటానికి ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో సికింద్రాబాద్ ఎమ్మె్ల్యేగా ఉన్న పద్మారావ్ గౌడ్‌కు కేసీఆర్ సీటిచ్చారు. పైగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవటంతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలం పెరిగింది. దీనికి తోడు ఎంఐఎం ఈసారి తామెవరికీ మద్దతు ఇవ్వటం లేదని ప్రకటించటం, బీఆర్ఎస్ నీరసించిపోవటంతో.. సహజంగానే ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉంది. దీనికోసం కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అసెంబ్లీల వారీగా మైనారిటీ నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. మరోవైపు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఈ ఐదేళ్లలో నియోజక వర్గాన్ని పట్టించుకోలేదనే అసంతృప్తి ఓటర్లలో బలంగా కనిపిస్తోంది. దీనికి తోడు మాజీ ఎంపీ దత్తాత్రేయ వర్గంతో ఈయనకున్న విభేధాలు, ధరల పెరుగుదల, కేంద్ర విధానాల పట్ల వ్యతిరేకతను బట్టి కూడా ఈసారి బీజేపీ ఓటమి ఖాయమనే మాట వినిపిస్తోంది. ఏదిఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గపు బాద్ షా ఎవరో అనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఎదురుచూడాల్సిందే.