Secularism In The Party, Aggressiveness in Governance: మూడునెలల నాడు తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆయన కుటుంబసభ్యుల పదేళ్ల నియంతృత్వ పోకడను, అహంకారాన్ని మట్టి కరిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నారు. ఎవరినైనా ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడిని నిజం చేస్తూ నాటి పాలకపక్షాన్ని విపక్షానికి పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారు. ఆ ఎన్నికల సందర్భంగా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో గ్రూపు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ నేతలంతా ఒక్క తాటిమీదికి వచ్చి ప్రజల మనసులను గెలవగలిగారు. కాంగ్రెస్ గెలుపుతో ఆ పార్టీ తరపున సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి డిసెంబరు 7న సీఎంగా ప్రమాణం చేశారు. సరిగ్గా ఈరోజుకి ఆయన పాలనకు 90 రోజులు నిండిన సందర్భంలో ఈ మూడు నెలల పాలనలోని వెలుగునీడలను ఓసారి ప్రస్తావించుకుందాం.
సీఎంగా కీలక నిర్ణయాల విషయంలో విపక్షనేతతో బాటు అన్ని పార్టీల మాటా వింటానని, అటు కేంద్ర ప్రభుత్వ సహకారాన్నీ తీసుకుంటామని సీఎం రేవంత్ తొలినాళ్లలోనే ప్రకటించారు. తర్వాత గాయం పాలై ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌ను వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని ప్రోత్సహించారు. పార్టీలోని సీనియర్లతో, తోటి నేతలతో కలసి పనిచేస్తూ వారి విశ్వాసానికి పాత్రుడయ్యాడు. కీలక నిర్ణయాల విషయంలో భేషజాలకు పోకుండా సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చారు. తద్వారా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలోనూ ఒక సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయగలిగారు. డిప్యూటీ సీఎంతో కలిసి ఢిల్లీ వెళ్లి, కేంద్ర పెద్దలను కలిసి తెలంగాణకు సంబంధించిన అంశాలను గుర్తుచేసి, సహకారం అందించాలని కోరారు. కేసీఆర్ మొండి ధోరణి కారణంగా కేంద్రం వద్ద ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిన అంశాలను తెలంగాణ కాంగ్రెస్ సర్కారు 90 రోజుల్లో పరిష్కరించగలిగింది.
ఉదాహరణకు హైదరాబాదులోని మెహదీపట్నంలోని రెండున్నర ఎకరాల రక్షణ శాఖ పరిధిలోని భూముల కేటాయింపు గురించి ప్రధాని, రక్షణమంత్రిని కలసి ఆ సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. దీంతో అక్కడ మంచి వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. అలాగే సుమారు ఆరేడేళ్ల క్రితం మంజూరైన రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో భూసేకరణ తర్వాత రోడ్డు నిర్మాణంలో విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ వైర్లు, పైపులైన్లు కాలువల నిర్మాణం ఇతరత్రా యుటిలిటీస్ తరలింపు కోసం రూ. 300 కోట్లను తెలంగాణ వాటాగా అందించాలని కేంద్రం కోరిందనే కారణం చెబుతూ నాటి కేసీఆర్ సర్కారు దానికి స్పందించలేదు. కానీ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి ఆరా తీసి, ఆ వాటా భరించటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమే ఆ నిధులు భరిస్తుందని చెబుతున్న నాటి ఒప్పందం బయటికొచ్చింది. దాని ప్రకారం పావలా ఖర్చులేకుండా ఆ పనీ పట్టాలెక్కింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే రాజీవ్ రహదారి మార్గంలో కొన్ని చోట్ల రోడ్డును ఆనుకుని ఉన్న రక్షణ శాఖ భూముల్లో 25 మీటర్ల మేర తెలంగాణకు బదలాయించేలా చేసి, అక్కడ ఎలివేటెడ్ సిక్స్ లేన్ రహదారి నిర్మించేందుకు మార్గం సుగమం చేశారు. ఇదే విధంగా పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారి 44 మార్గంలో సికింద్రాబాద్ పారడైజ్ నుండి సుచిత్ర మధ్య గల రక్షణ శాఖ భూమి కేటాయింపునూ పరిష్కరించగలిగారు. ఇదే జోరులో, రాజీవ్ రహదారిలో అల్వాల్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో మొదలైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో 74 కి.మీ. పూర్తి కావాల్సి ఉండగా కేవలం 69 కి.మీ. మాత్రమే పూర్తి అయింది. పాతబస్తీలోని ప్రార్థన స్థలాల తొలగింపు, ఎంఐఎం పార్టీ అభ్యంతరాల వల్ల పెండింగ్‌లో పడిన ఆ మిగిలిన 5 కి.మీ దూరంలోనూ మెట్రో నిర్మాణానికి సీఎం పూనుకున్నారు. ఎంఐఎం పార్టీ పెద్దలతో చర్చించి, పాతబస్తీలో మెట్రో రైలుకు తాము వ్యతిరేకం కాదని ఎంఐఎం అధినేత ఒవైసీ ప్రకటించేలా చేశారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు పొడిగింపు, మియాపూర్ నుండి బీహెచ్ఈఎల్, రాజేంద్ర నగర్‌లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు వరకు మెట్రో నిర్మాణం, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో మార్గ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలకు బదులు వెనకబడిన ప్రాంతాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొస్తే, ఆ ప్రాంతాల వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే వాస్తవిక దృక్పథంతో ఆ దిశగా అడుగులు వేశారు. ఇవిగాక, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న గ్రామ పంచాయితీ నిధుల విడుదల, రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్ లూమ్ టెక్నాలజీ మంజూరు వంటివన్నీ తెలంగాణ ప్రభుత్వ పెద్దల విజ్ఞత, రాజకీయ పరిణతి వల్ల సాధ్యమయ్యాయి. గతంలో విపక్షం తరపున ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏనాడూ ప్రభుత్వంలో భాగస్వామిగా లేకున్నా, కొన్నేళ్లుగా ప్రతి దానికీ కేంద్రంతో ఘర్షణ పడుతూ, మసకబారుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచే ప్రయత్నం చేశారు.
ప్రజాస్వామ్యంలో పార్టీలు తమదైన రీతిలో విధానపరంగా ఎదుటి పార్టీని విమర్శించొచ్చు. కానీ వ్యక్తిత్వ హననం పనికిరాదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన పదిరోజులకే ‘ఈ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది’ అంటూ విపక్షంలోని నేతలు మాట్లాడటంపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. అసూయతో చేస్తున్న ఇలాంటి అనేక కామెంట్లను సీఎం కూడా ఇటీవలి కాలం వరకు మౌనంగా సహిస్తూనే వచ్చారు. ఈ తరహా కామెంట్ల మీద ఒకటీ రెండు సందర్భాల్లో రేవంత్ విపక్షాలపై కాస్త ఘాటుగా స్పందించగానే సీఎంది అప్రజాస్వామికమైన భాషంటూ విపక్షనేతలు కొందరు గొంతు చించుకున్నారు. అయితే.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు ఇష్టపడని ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఈ ఆరోపణలను విని జనం నవ్వుకుంటున్నారు. అదే సమయంలో విపక్షాల ట్రాప్‌లో పడకుండా సీఎం తన వ్యాఖ్యల విషయంలో మరింత సంయమనం పాటించాలని కోరుతున్నారు.
దెబ్బతిన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కొత్త సీఎం నిర్ణయాలను స్వాగతిస్తూనే, గత పాలకులు చేసిన తప్పులకు దూరంగా ఉండాలని తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమాఖ్య స్ఫూర్తితో, లౌక్యంతో ఈ మూడునెలల కాలంలో ఆయన సాధించిన విజయాల పట్లా తెలంగాణ సమాజం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పాలనలో సవాళ్ల సవారీ చేస్తు్న్న సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తూ, వాస్తవిక దృక్పథంతో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిజం చేసే దిశగా కాంగ్రెస్ సర్కారు ముందుకు సాగాలని తెలంగాణలోని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు కోరుకుంటున్నారు.
– బండారు రామ్మోహనరావు (అనలిస్ట్)