– మరోసారి తెరపైకి సంధ్యా శ్రీధర్ రావు కేసులు
– భుజంగరావు కన్ఫెషన్ రిపోర్టులో పేరు
– బిగ్ టీవీతో మాట్లాడుతూ బెదిరించారని వాపోయిన వైనం
– రూ.13 కోట్ల బెదిరింపుల సంగతి సరే..
– రూ.5 వేల కోట్ల పనుల సంగతేంటి?
Crime News: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ‘స్వేచ్ఛ’ కథనాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు, కుట్ర ఎలా జరిగింది? పాత్రదారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? ఇలా అనేక విషయాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది ‘స్వేచ్ఛ’. తాజాగా భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్‌ను పరిశీలిస్తే, ట్యాపింగ్ కోసం అప్డేటెడ్ పరికరాలు వాడినట్టు తేలింది. సొంత నేతలతోపాటు, ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేశారు. రాజకీయ నేతల సమాచారంపై ఐన్యూస్ శ్రవణ్ కుమార్, నమస్తే తెలంగాణ దామోదర్ రావు నిఘా పెట్టారు. మొత్తం సమాచారాన్ని నిందితులు వారికి చేరవేశారు. సొంత ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా కేసీఆర్ ఎస్ఐబీని వాడినట్టు భుజంగరావు తెలిపాడు. బీఆర్‌ఎస్ పార్టీ ఫండ్స్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారు. సివిల్ సెటిల్మెంట్లు చేస్తూ బీఆర్‌ఎస్‌కు పార్టీ ఫండ్ ఇప్పించాడు ప్రభాకర్ రావు. ఓ స్థలం వివాదంలో వ్యాపారవేత్త సంధ్యా శ్రీధర్ రావును బెదిరించాడు. రూ.13 కోట్లతో ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించాడు. కేసులు తొలగిస్తారన్న హామీతో ఎలక్టోరల్ బాండ్స్ కొని ఇచ్చారు సంధ్యా శ్రీధర్ రావు. దీనిపై బిగ్ టీవీ ఆయన్ను సంప్రదించింది. ఈ సందర్భంగా శ్రీధర్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ నగర పరిధిలోని పోలీస్ స్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్ రావు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడ్నే అంటూ చెప్పుకొచ్చారు. 90కి పైగా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందుకున్న ఈ ఘనుడు, రూ.13 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించి నాటి ప్రభుత్వ పెద్దల పట్ల తనకున్న భక్తిని చాటుకున్నాడు. కానీ, ఈయన తనను బెదిరించే ఇవన్నీ రాయించుకున్నారని చెబుతున్నారు. అయితే, కొందరు బీఆర్ఎస్ నేతలతో వైరం ఉన్నా, మరికొందరితో అంటకాగుతూ తిరిగింది వాస్తవం. ఇప్పటికీ తిరుగుతున్నారు కూడా. అప్పుడప్పుడు తన కార్యాలయాల్లో సిట్టింగులు కూడా వేస్తుంటారు. నగర శివారు ప్రాంతాల భూములన్నీ నావే అని చెప్పుకుంటూ పలువురిని మోసగించిన శ్రీధర్ రావు, గత ప్రభుత్వ మద్దతుతో రూ.5 వేల కోట్ల మేర పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కానీ, బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు తనకే పాపం తెలియదన్నట్టు, తాను అమాయకుడ్ని అని చెప్పుకున్నారు. నిజానికి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మొదలుపెట్టగానే, ‘నా ఫోన్ ట్యాప్ చేసి, నా ఇంటికొచ్చి బెదిరించి, అన్యాయంగా కోట్ల రూపాయలు లాక్కుపోయారు’ అంటూ నాటి అధికారుల మీద ఫిర్యాదు చేశారు శ్రీధర్ రావు. అయితే, ఇతని బాగోతం తెలిసిన డీసీపీ, ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించినట్టు సమాచారం. అనేక మందిని చీట్ చేసి, బెదిరించి దర్జాగా కోట్లు సంపాదించిన ఇతగాడి దందాలకు నాటి ఫోన్ ట్యాపింగ్ బృందం అండ ఉందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడేమో బెదిరించారని చెప్పుకోవడం చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.