– సివిల్ సప్లై శాఖ అవినీతికి ఆధారాలేవీ?
– మిల్లర్లతో కుమ్మక్కై 1500 టెండర్లు వేసిందెవరో?
– బీజేపీలో ప్రమోషన్ కోసమే ఏలేటి ‘టాక్స్’ ఆరోపణలు
– బహిరంగ చర్చకు రండి.. లేదా ముక్కు నేలకు రాయండి
– టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి
Civil Supply: సివిల్ సప్లై శాఖలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం రామ్మోహన్ రెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీలు పౌర సరఫరా శాఖలో అవినీతి అంటున్నాయని, వీరిలో ఒకరేమో రూ. 11 కోట్ల కుంభకోణం జరిగిందని, మరొకరు రూ. 600 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, ఈ పసలేని, పొంతన లేని నేతల ఆరోపణలను జనం విని నవ్వుకుంటున్నారన్నారు. పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, పూటకో మాట మాట్లాడే ఏలేటి ఆరోపణల్లో ఒక్కశాతం కూడా వాస్తవం లేదన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ సన్న బియ్యం ఇవ్వలేదని, సకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనలేదని రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించటమే గాక అన్ని కాలేజీల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టాలని నిర్ణయించిన సంగతిని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు. కేటీఆర్ మిల్లర్లు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 1500కు టెండర్లు వేసింది ఈ నేతలేనని నిలదీశారు. కేటీఆర్‌కు మిల్లర్ల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని కౌంటరిచ్చారు.
అవినీతి ఆరోపణలు చేసే ఈ ఇద్దరు నేతలు ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని రామ్మోహన రెడ్డి సవాలు విసిరారు. దానికి ముందు.. తమ ఆరోపణలకు కనీస ప్రాతిపదిక ఏదైనా ఉంటే అదైనా బయటపెట్టాలని కోరారు. బీజేపీలో కిషన్ రెడ్డిని వెనక్కి తోసి, పెద్ద స్థానాలకు వెళ్లాలని మహేశ్వర రెడ్డి ఆరాటపడే క్రమంలోనే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇద్దరూ దమ్ముంటే అమర వీరుల స్థూపం వద్దకు వచ్చి చర్చలో పాల్గొనాలని, లేకుంటే తమ వాదన తప్పని అంగీకరించి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.