– సాహితీ కన్‌స్ట్రక్షన్ కేసు కంచికేనా?
– హడావుడి తప్ప ఆదుకునే వారే లేరా?
– పేరొందిన చార్టర్డ్ అకౌంట్‌తో లాబీయింగ్‌లు
– డబ్బులతో అంతా సెట్ చేస్తున్నారా?
– 110 అకౌంట్స్ ద్వారా పక్కదారి పట్టిన నగదు
– ఆధారాలు సేకరించి పోలీసులకు ఇచ్చిన ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం
– దర్యాప్తు పేరుతో నాన్చుడే తప్ప తేల్చిందేమీ లేదనే విమర్శలు
– కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్న బాధితులు
– త్వరలో పోరాటం మరింత ఉద్ధృతం
దేవేందర్ రెడ్డి, 9848070809
Sahiti scam case investigation delayed : ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం: బీఆర్ఎస్ హయాంలో జరిగిన భారీ స్కాముల్లో సాహితీ స్కామ్ ఒకటి. సామాన్యుడి సొంతింటి కలను ఆసరాగా చేసుకుని వందల కోట్లను కొట్టేశాడు ఆ సంస్థ ఓనర్ బూదాటి లక్ష్మినారాయణ. అతని వెనుక గులాబీ నేతలు ఉన్నారనే ఆరోపణలున్నాయి. బినామీ డైరెక్టర్స్‌ని పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ స్కాములో సూత్రధారులు అనే డౌట్స్ ఉన్నాయి. 3,500 మంది సొంతింటి ఆశతో పెట్టుబడి పెట్టి మోసపోయారు. రూ.1,200 కోట్లు చెల్లించి మూడేళ్లుగా బాధపడుతున్నారు. ఆ సొమ్మంతా ఎక్కడకు పోయిందో ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయి. కేసీఆర్ కూతురు కవిత సెటిల్మెంట్స్ చేస్తానని తీసుకున్న డబ్బులకు డైరెక్టర్స్ వద్ద ఆధారాలున్నాయి. రూ.1,000 కోట్లు ఛైర్మన్ బూదాటి లక్ష్మినారాయణ ఎవరెవరికి ఏ ప్రాజెక్ట్‌లో పెట్టాడో ప్రతీ రిసిప్ట్‌లు లభ్యమవుతాయి. కానీ, సీసీఎస్ పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా విచారణను జాప్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యూలర్‌గా డైరెక్టర్స్‌ని, డబ్బులు తీసుకున్న వారిని విచారణ చేస్తున్నా ఇంకా ఎందుకు కొలిక్కి రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
బూదాటి జల్సాలు
పోలీసుల కళ్ల ముందే బూదాటి తప్పించుకు తిరుగుతున్నాడు. భూముల రేట్లు పెరిగాయని చెప్పుకుంటూ, కొత్త పార్టీలకు ఆ ప్రాజెక్ట్స్ అప్పగించేందుకు సింగపూర్ కంపెనీలతో మీటింగులు పెట్టుకుంటున్నట్లు సమాచారం. గోవాలో మందు, విందు పార్టీలతో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరు టు గోవా వయా హైదరాబాద్‌కు ఎవరికీ దొరకకుండా చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.
ప్రాజెక్స్ట్ టేకోవర్ చేస్తామంటూ లాబీయింగ్
హైదరాబాద్‌లో పేరొందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ సాహితీ స్కామ్‌ని టేకోవర్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు బడా కంపెనీలకు అకౌంట్స్, అడిట్ చేసే ఆ చార్టెడ్ అకౌంటెంట్ లాబీయింగ్ చేస్తున్నట్లు సీసీఎస్ వద్ద తెగ మాట్లాడుకుంటున్నారు. ఎవరైతే పోరాటం, ఫిర్యాదులు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 14 మంది బాధితులకు సదాశివపేట్‌లో ఓపెన్ ప్లాట్స్ 18 వేలకు గజం చొప్పున అప్పగించారు. సీసీఎస్‌లో ఫిర్యాదులు చేసిన వారిలో ఒకరికి 90 శాతం, మరో ఇద్దరికి 70 శాతం డబ్బులు మొదట్లోనే ఇచ్చేశారు.
కొనసాగుతున్న ఫైటింగ్
అమీన్ పూర్‌లో హైరెజ్ టవర్స్ అంటూ జరిగిన మోసంపై బాధితులు సైట్‌లోనే టెంట్స్ వేసుకుని అందోళన చేస్తున్నారు. మోసం చేసిన వారు కళ్ళ ముందే తిరుగుతుండటంతో ఆందోళనలు మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. కొద్ది రోజుల్లోనే ధర్నా చౌక్ వద్ద మరోసారి ధర్నాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు వేగవంతమే.. కానీ!
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత హైదరాబాద్ అడిషనల్ సీపీ క్రైం ఆధ్వర్యంలో బాధితుల వద్ద నుంచి డేటా సేకరించారు. బడా నేతలు, బిల్డర్స్ పాత్ర ఏంటో తేల్చేశారు. దీంతో సీసీఎస్‌లో ఉండే ఏసీపీ ఉమామహేశ్వర్ రావు, డీసీపీ శ్వేత కేసులో పూర్తి ఆధారాలు రాబట్టారు. అయితే, దర్యాప్తు వేగవంతంగా కనిపించినా ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. లాబీయింగ్‌లతో పాటు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని బాధితులు అభిప్రాయపడుతున్నారు. క్రిమినల్ కేసుగా కాకుండా సివిల్ కేసుగా విచారణ జరుపుతున్నట్లు అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అధికారులను మేనేజ్ చేశామని కొంతమంది ఫైనాన్సర్స్, సాహితీ నుంచి డబ్బులు తీసుకున్న వారు బహిరంగంగానే చెబుతుండటంతో కేసు నీరుగారుతోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈడీ కేసు నమోదు చేసినందున ప్రతి పైసాకి లెక్క సీసీఎస్ విచారణలో ఉంటుందని, లేదంటే పోలీస్ అధికారులకు కూడా చిక్కులు తప్పవనే ధీమా బాధితుల్లో కనిపిస్తోంది.