Rythu Bandhu: రైతు బంధు..ఇది కేసీఆర్ హయాంలో వినిపించిన మాట. ఇప్పుడు రైతు భరోసాగా పిలుస్తున్నారు. పేరు ఏదైనా, రైతులకు న్యాయం జరిగిందా? లేదా? అనేదే పాయింట్. అయితే, కేసీఆర్ హయాంలో రైతు బంధుపై అనేక వివాదాలు ఉండేవి. అనర్హులకు కూడా సాయం అందిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. సొంత పార్టీ నేతలే కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సందర్భాలున్నాయి. కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతు బంధు అందిందని ఆనాటి ప్రతిపక్షాలు తిట్టిపోశాయి.
తాజాగా మరోమరు ఈ అంశం చర్చనీయాంశమైంది. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణలో కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. గత పాలకులు ఈ పథకాన్ని 5 నెలల పాటు ఇచ్చారని తాము వారికంటే తక్కువ సమయంలోనే ఇస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుత చర్చకు దారి తీశాయి. కేసీఆర్ హయాంలో రైతు బంధు సాయం వెనుక కూడా అక్రమాలు కొనసాగాయి. అయినా కూడా ఆనాడు పట్టించుకున్న పాపానపోలేదనే విమర్శలున్నాయి.
Read More: చేతులెత్తేసిన బీఆర్ఎస్..!
ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే, రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాల పట్టా భూములున్నాయి. వాటిలో ఎకరం లోపు భూమి కలిగిన వాళ్లు 22.55 లక్షల మంది మాత్రమే. 5 ఎకరాల్లోపు వాళ్లు 62.34 లక్షల మంది ఉంటారు. కోటి ఎకరాల భూమి వీళ్ల చేతుల్లోనే ఉంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవాళ్లు 6.65 లక్షల మంది దాకే ఉంటారు. కానీ, వీళ్ల దగ్గర 52 లక్షల ఎకరాల దాకా భూమి ఉంది. వీరిలో చాలామంది బడాబాబులు ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు ఎక్కువే. అయినా కూడా లక్షల్లో రైతు బంధు సాయం పొందుతున్నారు. ఇదే వివాదానికి దారి తీసింది. సాగు చేస్తున్న వారికే సాయం అందాలన్న డిమాండ్ పెరిగింది. రేవంత్ ప్రభుత్వం కూడా ఆ దృష్టితోనే ఆలోచిస్తోంది. పెట్టుబడి సాయం 15 వేలు సాగు చేస్తున్న వారికే అందించాలని భావిస్తోంది.
మరోవైపు, రోడ్లకు కూడా రైతు బంధు డబ్బులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. గతంలో హైదరాబాద్ టు శ్రీశైలం హైవే కోసం రంగారెడ్డి జిల్లా అమన్‌గల్లు మండలంలో 48 ఎకరాల దాకా రైతుల నుంచి సేకరించి పరిహారం అందించారు. అయితే, 2018లో ధరణి వచ్చాక రోడ్డు విస్తీర్ణంలో భూమి కలోపోయిన వారి కుటుంబాలను అడ్డు పెట్టుకొని కొందరు అక్రమాలకు పాల్పడ్డారు. రికార్డుల్లో పట్టాకాలంలో వస్తున్న పేర్లను ఆధారంగా చేసుకుని తిరిగి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
Read More: పవన్ కల్యాణ్ వివాహ వ్యవస్థకే కళంకం : సీఎం జగన్
ధరణి అమలు తర్వాత సేకరించిన భూమికి కూడా పట్టా పాస్ బుక్‌లు జారీ అయ్యాయి. దానివల్ల రైతు బంధు సాయానికి అర్హత వచ్చింది. ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు చూసింది. ఇదేకాదు, కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాలకు కూడా రైతు బంధు సాయం అందుతోందని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెడుతూ, రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అర్హులకే రైతు బంధు సాయం అందించాలని నిర్ణయించింది.