పల్లెపై పట్టుకై పార్టీల తంటాలు
గత పదేళ్లులో పడకేసిన పల్లె ప్రగతి
పంచాయతీ నిధులనూ మళ్లించిన నాటి సర్కారు
గ్రామాలపై కేంద్రం శీతకన్ను.. నిధులన్నీ స్మార్ట్ సిటీలకే
నిధుల కేటాయింపులోనూ పల్లెలకు అన్యాయమే
నేటికీ పల్లెల్లో 70 – 80 % పోలింగ్ నమోదు
Rural Areas Record Higher Polling Percentage: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక కీలక ఘట్టం. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయటం వల్లనే మన ప్రజాస్వామ్యం మనగలుగుతోంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు తెలంగాణలోని పల్లె వాసులు. అంతేకాదు.. పోలింగ్ రోజున ఎన్ని పనులున్నా మానుకుని క్యూలో నిలబడి మరీ.. తమకు నచ్చిన పార్టీకి ఓటేస్తున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ పట్టణ, నగర ఓటర్లు మాత్రం ఈ వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ మార్పు చాలా స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో గ్రామీణ ఓటర్లే కీలకంగా వ్యవహరించారని పోలింగ్ గణాంకాలూ చెబుతున్నాయి. తెలంగాణలో మొత్తం 13 కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీలున్నాయి. ఇక.. రాష్ట్రంలోని మొత్తం గ్రామాల సంఖ్య 12,769. మొత్తం జనాభాలో 61 శాతం గ్రామాలలో, మిగిలిన 39 శాతం పట్టణాలలో నివసిస్తున్నారు. అయితే, ఎన్నిక ఏదైనా పోలింగ్ శాతం విషయంలో పల్లెలే ముందుంటుండగా, పట్టణవాసులు మాత్రం పోలింగ్ రోజు గడప దాటి కాలు బయట పెట్టటం లేదు. అటు పల్లెలో, ఇటు పట్టణాల్లో ఓటున్న వారు మాత్రం.. తమ పల్లెలోనే ఓటు వేసేందుకు ఇష్టపడటమూ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ తగ్గటానికి మరో కారణంగా ఉంది. దీని కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని పరిధిలో కాంగ్రెస్ వెనకబడిందనే వాదనా ఉంది.
ఓటెత్తుతున్న పల్లెలు
మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఇప్పటికే పట్ణణ, నగర ప్రాంతాల్లో నివాసముంటున్న చాలామంది పల్లెబాట పట్టేశారు. ఆదినుంచీ పల్లె ప్రగతికి కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణులకు మేలు చేసే పథకాలనూ ప్రకటించి, వారి మనసు గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోలోనూ పల్లె ప్రగతికి, గ్రామీణులు సమస్యలకు పెద్ద పీట వేసింది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే.. 2014లో బీఆర్ఎస్‌కు వచ్చిన సీట్లలో 62 శాతం గ్రామీణ ప్రాంతాలవి కాగా, 2018లో 69 శాతం రూరల్ సీట్లను పొందగలిగింది. మరోవైపు 2018లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో 19 దాదాపు గ్రామీణ ప్రాంతాలవే. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ఓటర్ల మనసు గెలిస్తే గెలుపు ఖాయమనే భావనతో ఉదయం ఉపాధి హామీ కూలీలను కలసి ఓట్లడుగుతూ, సాయంత్రం మహిళా సంఘాలు, కులసంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. మరోవైపు నగర, పట్టణ ప్రాంత పార్టీగా పేరొందిన బీజేపీ ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రచారం చేస్తోంది.
హస్తానికే పల్లె ఓటింగ్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఈసారీ గ్రామీణ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉండనుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. గ్రామాల్లోని బలమైన పార్టీ నిర్మాణం ఉండటం, స్థానిక నేతలు ప్రత్యక్షంగా పోల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు తీసుకోవటం, గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత పథకాల అమలు విషయంలో స్థానిక నేతల సాయం అక్కరకొస్తుందనే ఓటరు భావన కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలు. దీనికి తోడు పదేళ్లుగా పంచాయతీలు నిర్వీర్యం కావటంతో కనీసం భవిష్యత్తులోనైనా పల్లెల్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలిచి తీరాలనే భావన స్థానికంగా కనిపిస్తోంది. బీజేపీ ఆదినుంచి స్మార్ట్ సిటీస్ అంటూ ప్రచారం చేస్తూ, నిధులన్నీ ప్రధాన నగరాలకే కేటాయించింది. పల్లెలకు చెందిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కూడా నిలిపేసిందనే ఆగ్రహం సర్పంచ్, వార్డు మెంబర్లలో ఉంది. దీంతో పార్టీలకు అతీతంగా వారంతా హస్తంవైపు మొగ్గుతున్నారు.