Running History, Heated Telugu Politics : ‘విదియనాడు చంద్రుడు కనిపించకపోతే తదియనాడు తానే కనిపిస్తాడు’ అనే సామెత లాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఏడు విడతల్లో 80 రోజులపాటు సాగే ఈ సార్వత్రిక ఎన్నికల క్రతువు జూన్ 4న వచ్చే ఎన్నికల ఫలితాలతో ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసన సభలకూ ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 2న విడుదల కానుండగా, మిగిలిన అన్ని ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే. ఎటొచ్చీ ఈ 80 రోజుల ఎన్నికల ప్రచార ‘వైతరణి’ని దాటటం బరిలో దిగిన అభ్యర్థులకు తలకు మించిన భారమే అవుతోంది. సుమారు మూడు నెలల పాటు పార్టీ కార్యకర్తలను పోషించాల్సి రావటం, బహుముఖంగా పెరుగుతున్న ఎన్నికల ఖర్చును భరించటం ప్రతి ఎన్నికల్లోనూ సాధారణమే అయినా, ఏటా ఈ ఖర్చులు ఊహించని స్థాయిలో పెరగటం పార్టీలకు తలకు మించిన భాగంగా మారుతోంది.
మరోవైపు ప్రజలు కూడా తెలివి మీరారు. ‘చచ్చిన దానికి వచ్చిందే కట్నం’ అన్నట్లుగా ఎన్నికల వేళ అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి అందినకాడికి డబ్బు పుచ్చుకుందామనే ధోరణి పెరిగిపోయింది. నాయకులు విలువలకు నీళ్లొదిలాక, ప్రజలు నిబద్ధతగా ఉండటం అసాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ మన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ అంశాన్ని గుర్తుచేశారు. మన ఎన్నికల్లో ‘మనీ అండ్ లిక్కర్ పవర్’ ఎంతగా పెరుగుతోందో ఉదాహరణలతో సహా వివరించారు. పార్టీలు, నేతల ప్రభావానికి లోనవకుండా విచక్షణతో ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ సందేశాన్ని చిట్టచివరి ఓటరకూ అందించాల్సిన భాద్యత మనందరి మీదా ఉంది.
Read More:కుదేలైన యూనివర్సిటీలు కుదరుకునేదెలా?
మరోవైపు.. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనగా, ప్రధాని మోదీ దేశవ్యాప్త సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వారం రోజుల్లోనే రెండుసార్లు ఏపీ, తెలంగాణల్లో జరిగిన సభలకు హాజరయ్యారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానంలో జరిగిన రోడ్ షో, నాగర్ కర్నూల్ సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన నాగర్ కర్నూ్ల్‌లో ఉండగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ తర్వాత మార్చి 17న చిలకలూరిపేటలో జనగళం పేరిట బిజెపి,టిడిపి, జనసేన సంయుక్తంగా నిర్వహించిన సభలో, మార్చి 18న జగిత్యాల సభలోనూ ఆయన ప్రసంగించారు. బహుశ: తెలుగు రాష్ట్రాల్లో మోదీ తొలి విడత ప్రచారం పూర్తియినట్లే భావించాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం విషయానికి వస్తే గత ఎన్నికల్లో మోదీని తిట్టిన టీడీపీ, జనసేనలే తాజాగా మోదీని, బీజేపీని వేనోళ్ల కీర్తిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా కుదిరింది. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అన్నట్లుగా ఈ పార్టీలన్నీ కలిసి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నాటి ఎన్నికల ప్రచారంలో తిరుపతి సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమక్షంలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో మోదీ ఏపీ ప్రజలకు విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జనసేనాని పోటీలో దిగకుండా ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. ఆ హామీలు నమ్మి ఏపీ ప్రజలు ఈ కూటమిని గెలిపించారు. ఆ ఎన్నికల తర్వాత మోదీ దేశ ప్రధానిగా, చంద్రబాబు ఏపీ సీఎంగా ఎన్నిక కాగా, 69 సీట్లతో వైసీపీ విపక్షానికి పరిమితమైంది. 2014 నుంచి విభజన హామీల అమలును మరచిన ప్రధాని మీద జనసేనాని తిరగబడగా, ప్రత్యేక హోదాను మరచి ప్రత్యేక ప్యాకేజీనికి ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు కూడా సర్దుకుపోదామనే ధోరణికి వచ్చారు. కానీ, వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ లేవనెత్తాక, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పల్లవిని అందుకుని, మోదీని విమర్శిస్తూ నాటి ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి మోదీ, చంద్రబాబు పార్టీల మధ్య దూరం పెరిగి, వైరంగా మారింది. ఈ క్రమంలోనే మోదీని వ్యక్తిగతంగా విమర్శించటం, తిరుమల వచ్చిన హోంమంత్రి కాన్వాయ్ మీద దాడి వంటి పరిణామాలూ చోటు చేసుకున్నాయి.
Read More: శనీశ్వరంగా మారిన కాళేశ్వరం..!
2014 ఎన్నికల్లో బిజెపి టీడీపీ జనసేన కూటమి ‘కలసి ఉంటే కలదు సుఖం’ సినిమాను చూపించగా, 2019 నాటికి ‘ఎవరికి వారే యమునా తీరే’గా మారి విడివిడిగా పోటీచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం కాగా, జనసేనకు ఒక్కటే సీటు దక్కింది. బీజేపీకి ఆ ఒక్కసీటూ రాలేదు. కానీ, మోదీ మీద కోపం, టీడీపీ, జనసేనల అనైక్యత, ప్రత్యేక హోదా, ఒక్క అవకాశం అంటూ జగన్ చేసిన పాదయాత్రతో వైసీపీ 151 ఎమ్మెల్యే, 22 సీట్లు గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. నాటి నుంచి ఏపీ సీఎం పథకాల అమలు పేరుతో పాలన చేస్తూ తనకంటూ బలమైన ఓటు బ్యాంకును స్థిరపరచుకోవటమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ, అమరావతి నిర్మాణంతో బాటు అన్ని రకాల అభివృద్ధినీ పక్కనబెట్టారు. సీన్ కట్ చేస్తే.. 10 ఏళ్ల కాలం మంచులా కరిగిపోయింది. ఈ పదేళ్ల కాలంలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నిర్మాణాత్మక కార్యక్రమాలేవీ చేపట్టలేకపోయాయి. విభజన హామీల్లో కీలకమైన రాజధాని నిర్మాణం, పోలవరం అటకెక్కాయి. దీంతో ఏపీలోని పార్టీలన్నీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీకి తలవంచాయనే అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. ఈ సమయంలో ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి మూడవసారి ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల పనితీరును అంచనా వేసుకుని ఈసారి ప్రజలు తీర్పునిచ్చేందుకు అక్కడ సిద్ధమవుతున్నారు.
ఇక, చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభలో 2014 నాటి రాజకీయ దృశ్యమే పునరావృతమైంది. కానీ, ఏపీకి న్యాయంగా దక్కాల్సిన హక్కుల గురించి చంద్రబాబు నాయుడు ప్రజల సాక్షిగా గుర్తుచేయటానికి బదులుగా ప్రధానిని ‘విశ్వనాయకుడు’ అంటూ ఆకాశానికి ఎత్తటం ఆశ్చర్యం కలిగించింది. గతంలో రాష్ట్రాలన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ను దోషిగా చేసిన ఈ పార్టీలు ఈ పదేళ్ల కాలంలో ప్రజలకు ఏమి చేశాయో మాత్రం ఆ సభలో మాటమాత్రంగా చెప్పలేకపోయాయి. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల ఈ కూటమిని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ నిలదీసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రమంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏపీలో కమ్యూనిస్టు పార్టీలతో కూటమి కట్టి సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభనూ ఆ పార్టీ నిర్వహించింది. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాన అతిథిగా ఆహ్వానించటంతో కాంగ్రెస్ వార్తల్లో నిలిచింది. విశాఖ ఉక్కు మొదలు ఏపీ సర్కారు వైఫల్యాలు, మోదీ ప్రభుత్వ ద్వంద్వనీతి, విభజన హామీలపై అక్కడి పార్టీలు ఆడిన దొంగాట తదితర అంశాలపై రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఏపీ ప్రజలను విశేషంగా ఆకర్షించింది. పనిలో పనిగా ఏపీకి ఏనాటికైనా షర్మిల సీఎం అవుతుందినీ రేవంత్ రెడ్డి ప్రకటించి, కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. మొత్తానికి రేపటి ఏపీ ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ఒక పోటీదారుగా నిలిచేందుకు విశాఖ ఎన్నికల సభ ఒక ప్రాతిపదికను ఏర్పరచింది. టీడీపీ, బీజేపీ, జనసేన, వైసీపీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో అక్కడ జరిగే రాజకీయ పరిణామాలు ఎవరిని విజేతలుగా నిలుపుతాయో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే!!!.
-బండారు రామ్మోహన రావు (రాజకీయ విశ్లేషకుడు)