Rulers Voting In The Name of Rama: నేడు శ్రీరామనవమి. రాముడిని విశిష్ట పాలకుడిగా రామాయణం చెబుతోంది. జాతిపిత గాంధీజీ సైతం రామరాజ్యం మనకు ఆదర్శం అన్నారు. కానీ, రాముడి పేరుతో ఓట్లడుగుతున్న మన పాలకులు గత పదేళ్ల పాలనా కాలంలో 10 ప్రభుత్వాలను నిలువునా కూల్చి రాముడి ఆదర్శాలను గంగపాలు చేశారు.
రాముడి పేరుతో రాజకీయం
వనవాస కాలంలో రాముడు సీతా, లక్ష్మణ సమేతుడై కుటీరంలో జీవిస్తూ, కందమూలాలు తిని జీవించాడు. ప్రకృతితో మమేకమై జీవించటమే గాక అక్కడ నివాసముండే మునిజనులను, వనచరులను కాపాడాడు. కానీ, గత ఆయన పేరుతో రాజకీయం చేసే మన నేతలు బాక్సైట్ కోసం అడవులను కార్పొరేట్లకు అప్పగించి, ఆదివాసీలు, గిరిజనులకు బతుకు లేకుండా చేస్తున్నారు.
ప్రభుత్వాలను కూల్చడమే ఆదర్శమా?
మరి కాసేపట్లో పట్టాభిషేకానికి సిద్ధమైన రాముడు తండ్రి మాటను గౌరవించి, రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్లాడు. ఆ ఆదర్శపాలకుడి ఆధునిక వారసులమని చెప్పే మన నేతలు రాత్రికి రాత్రే ప్రభుత్వాలను కూలదోసి అధికారాన్ని లాక్కుంటున్నారు. గత పదేళ్లలో రామభక్తుల పార్టీ అక్రమంగా పడగొట్టిన ప్రభుత్వాల సంఖ్య
కమలనాథుల మిత్రద్రోహం
మిత్రధర్మానికి రాముడు ప్రతీక. సీతాన్వేషణలో తనకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు. రావణ వధ తర్వాత లంకకు విభీషణుడినే రాజును చేసి, తాను అయోధ్యకు తిరిగొచ్చాడు. రాముడి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పే అయోధ్య ఉద్యమంతో సహా 30 ఏళ్లు అండగా నిలిచిన శివసేన మొదలు అనేక రాష్ట్రాల్లోని అనేక ప్రాంతీయ పక్షాలను నిలువునా చీల్చిపారేశారు.
ప్రజాస్వామ్యానికి తూట్లు
కేవలం ఒక్క మనిషి చేసిన ఆరోపణకు స్పందించిన రాముడు.. సీతమ్మను అడవికి పంపాడు. రామరాజ్యంలో ఒక పౌరుడి అభిప్రాయానికి నాటి పాలకుడిచ్చిన విలువకు అది ఒక ఉదాహరణ. రామాలయం కట్టామని చెబుతున్న మన పాలకులు మరో అభిప్రాయానికి తావులేని రీతిలో నిర్ణయాలు చేయటం, ఇదేంటని నిలదీసిన వారిని పలు రకాలుగా వేధించటం మనం చూస్తున్నాం.
విభజించు.. పాలించు!
పాలకుడు తన పాలనలోని ప్రతి వర్గాన్నీ సమానంగా చూడాలని రాముడు తన ఆచరణలో నిరూపించాడు. కానీ, తాము మాత్రమే రామభక్తులమని చెప్పుకునే మన పాలకులు కుల, మత, వర్ణ, ప్రాంత, భాషా వివక్షలను ప్రోత్సహిస్తూ, ఆయా వర్గాలను ఒకరికి ఒకరు శత్రువులుగా మారేలా చేస్తున్నారు.
విలువల్లేని రాజకీయం
కుటుంబ విలువలకు రాముడు ప్రతీక. తన కుటుంబం చీలిపోకూడదని రాముడు నాడు తండ్రిమాటకు కట్టుబడి మౌనంగా అడవికి పోయాడు. కానీ, తమ అధికారాన్ని నిలుపుకోవటం కోసం ప్రత్యర్థి పార్టీల కుటుంబాలనూ నిట్టనిలువునా చీల్చటం నేటి కాషాయ పాలకులకు రోజువారీ వ్యవహారంగా మారిందనే విమర్శలున్నాయి.సత్యధర్మాలకు ప్రతీకైన రామచంద్రుడు మన అందరివాడు. ఆయనను కొందరివాడిగా చేసే రాజకీయ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేద్దాం.