– శ్రీధర్ రెడ్డి హత్య కేసులో చర్యలేవీ?
– మంత్రి నిందితుడైతే చర్యలుండవా?
– వారంలో చర్యలు తీసుకోకుంటే.. రోడ్డెక్కుతా?
– ఫోన్ ట్యాపింగ్‌పై రాజకీయం తగదు
– నిందితులకు శిక్ష పడక తప్పదు
– బీఆర్ఎస్ నేత ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్
Murder Case: వనపర్తి జిల్లాలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రవీణ్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన సోమవారం డీజీపీ రవిగుప్తాని కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘హత్య జరిగి నాలుగు రోజులైంది. ఈ దారుణమైన ఘటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కనీసం ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టైనా చెయ్యలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జూపల్లి నేటికీ తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీధర్ రెడ్డి హత్యను ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హోమ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ.. పోలీసులు చురుగ్గా వ్యవహరించటం లేదు. వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం’ అని ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై..
ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై కూడా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అంశం దేశభద్రకు సంబంధించిందనీ, దానిపై మాజీ పోలీస్ అధికారిగా తానేమీ వ్యాఖ్యానించబోనని అన్నారు. ఈ అంశంపై మీడియాకు ఇప్పటికే స్పష్టతనిచ్చానని గుర్తుచేశారు. ఈ అంశంపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్నదనీ, కనుక ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడటం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి తీరతారని అన్నారు. ట్యాపింగ్ వెనక ఎవరున్నా సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులకు శిక్షలు పడేలా చేయాలని కోరారు.
కాగా.. నాలుగురోజుల క్రితం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనక మంత్రి జూపల్లి హస్తం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేయగా, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని మంత్రి జూపల్లి స్పందించారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమారని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు.. హత్యకు దారి తీసిన పరిణామాలు, వ్యక్తిగత, రాజకీయ కక్షలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తగవులపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.