MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలులోనే విచారించడానికి సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ దరఖాస్తు తమకు అందించలేదని, కాబట్టి, సీబీఐ విచారణ అనుమతి నిలుపుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో పిటిషన్ వేశారు. కవిత పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు స్వీకరించింది. అయితే.. సీబీఐ విచారణ అనుమతిని ఉపసంహరించలేదు. స్టేటస్ కోకు అంగీకరించలేదు.
ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై వివరణ ఇవ్వడానికి తమకు సమయం ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఇందుకు కోర్టు అంగీకరించింది. ఈ నెల 10వ తేదీ వరకు సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. ఈ 10వ తేదీన వాదనలు వింటామని, విన్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
Also Read: కేసీఆర్‌పై ముగ్గురు మంత్రుల కౌంటర్ ఎటాక్.. కాకతీయ మిషన్ ఏమైందీ?
కవితను విచారించడానికి ఈ నెల ఫిబ్రవరిలో సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కానీ, ముందుగా నిర్ణయించుకున్న పనులు ఉన్నందున విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత ఈడీ, ఐడీ అధికారులు కవిత ఇంటికి వచ్చి సోదాలు చేశారు. అదే రోజున ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈడీ విచారించిన తర్వాత జ్యుడీషల్ కస్టడీలోకి తీసుకుని ఆమెను తిహార్ జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Also Read: కంట్మోన్మెంట్ ఉపఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్
కవితను విచారించాలని అనుకుంటున్నామని సీబీఐ కోర్టుకు వచ్చింది. జైలులోనైనా ఆమెను విచారించే అవకాశం ఇవ్వాలని కోరింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఒక వేళ సీబీఐ ఆమెను కస్టడీలోకి తీసుకుంటే.. ఆమె బయటికి రావడానికి సీబీఐ కేసులోనూ బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వరకే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో కొడుకు చదువు కోసం కవిత మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. సోమవారం బెయిల్ పై తీర్పు వెలువడనుంది. అలాగే.. రెగ్యులర్ బెయిల్ పై 20వ తేదీన తదుపరి విచారణ జరగనుంది.