Rohit Sharma Shreyas Iyer Bring Ipl Fever To The Great Indian Kapil Show: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ షో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇండియా వ్యాప్తంగా చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వన్డే ప్రపంచకప్ గురించి రోహిత్ మాట్లాడుతూ..ఫైనల్‌లో ఓటమికి గల కారణాలను వివరించాడు. అలాగే ఇంగ్లండ్ సిరీస్ విశేషాలను పంచుకున్నాడు. మరోవైపు హిట్‌మ్యాన్‌తో గల అనుబంధాన్ని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. రోహిత్ తనకి ప్రేరణగా నిలుస్తాడని చెప్పాడు. రోహిత్ శర్మ ఎప్పటిలానే తన హ్యుమర్‌తో షోలో అలరించాడు.
టీమిండియాలో ఎదురైన కొన్ని క్లిష్టతరమైన సందర్భాలనూ ఫన్నీగా వివరించాడు. 10, 11 స్థానాల్లో వెళ్లే భారత ప్లేయర్లను కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాలని కోరినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో రోహిత్ తెలిపాడు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని రన్స్ కూడా చాలా కీలకమే. అలాంటి సందర్భాల్లో 10, 11 బ్యాటింగ్ వెళ్లే ఆటగాళ్లతో మరో 10 నుంచి 20 రన్స్ అయినా చేయండని చెబుతుంటాం. అప్పుడు వాళ్లు మీరు రన్స్ చేయడంలో ఫెయిలై మమ్మల్ని చేయమని అడుగుతారేంటని అంటుంటారని రోహిత్ వివరించాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో రోహిత్ సహచర ఆటగాళ్లతో కొన్నిసార్లు అసభ్యపదజాలంతో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్లేయర్లను రోహిత్ తిట్టడం స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read:బెంగళూరు ఓటమికి రీజన్ ఇదేనా..!
దీని గురించి రోహిత్ స్పందిస్తూ..నా మాటలు కొన్ని స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. నేనేమో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుంటాను. మా ఆటగాళ్లేమో బద్ధకంగా ఉంటుంటారు. అక్కడ నాకు మరో మార్గం లేదు. అందుకే అలా మాట్లాడుతుంటా. అవన్నీ మైక్‌లో వినిపిస్తుంటాయని రోహిత్ నవ్వుతూ చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి గురించి హిట్ మ్యాన్ మాట్లాడాడు. ఫైనల్‌లో మా కంటే ఆస్ట్రేలియా ఉత్తమంగా ఆడింది. 40 పరుగులకే మూడు వికెట్లు సాధించినా వాళ్లు మంచి టీమ్ వర్క్‌ని నెలకొల్పారు. అయితే వరల్డ్ కప్ ఓటమిపై ఫ్యాన్స్ మాపై కోపం చూపిస్తారనుకున్నా. కానీ మాకు ప్రేమను పంచారు. మేం గొప్పగా పోరాడామని చెప్పారని రోహిత్ పేర్కొన్నాడు. కాగా.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు రోహిత్, శ్రేయస్ షోలో పాల్గొనగా, ఈ ప్రోగ్రామ్ తాజాగా రిలీజ్ అయింది.