– ఇంటర్వూ స్లాట్ల కోసం ఎదురుచూపులు
– మార్చి పూర్తవుతున్నా రాని ఇంటర్వూ షెడ్యూల్
– వీసా రాకపోతే.. ఏడాది వేస్టవుతుందనే గుబులు
– కౌంటర్లు పెంచినా.. ప్లానింగ్ లేదనే విమర్శలు
Risk Of Students For Visa,Waiting for interview slots : అమెరికాలో పై చదువు కోసం వెళ్లాలని సిద్ధమవుతున్న తెలుగు విద్యార్థులకు వీసాల దిగులు నిద్రపట్టనీయటం లేదు. సాధారణంగా ఫాల్ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుంది గనుక ఏటా ఆ సమయంలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. అయితే.. ఈ ఏడాది మార్చి నెల చివరకు వస్తున్నా ఇప్పటివరకు కాన్సులేట్ కార్యాలయం నుంచి ఇంటర్వూ షెడ్యూల్ గురించిన ఏ సమాచారమూ లేకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అమెరికాలో విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందు మాత్రమే వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదలవుతాయనే వార్తలు రావటం, ఒకవేళ అదే నిజమైతే అతి తక్కువ సమయంలో తమకు స్లాట్ ఎలాట్ అయితే.. వీసా ఇంటర్వ్యూ సంతృప్తికరంగా చేయలేమనే భయమూ విద్యార్థుల్లో కనిపిస్తోంది.
గతంలో అమెరికా వెళ్లే విద్యార్థులు వరుసగా రెండు సార్లు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా, మూడో ఛాన్స్ ఉండేది. కానీ, ప్రస్తుతం దీనిని రెండు సార్లకే పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందనే వార్తలు రావటంతో, ఒకవేళ తమకు తొలి ఇంటర్వ్యూలో వీసా మంజూరు కాకపోతే, మళ్లీ జూన్, జులై స్లాట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, అప్పుడూ రిజెక్ట్ అయితే పరిస్థితి ఏంటని విద్యార్థులు మథన పడుతున్నారు. మరోవైపు ఆగస్ట్ రెండోవారం నుంచి అమెరికా వర్సిటీల్లో క్లాసులు మొదలవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు.
Read Also : ఆంక్షలు పోయి ఆకాంక్షను తెచ్చిన ఫ్రీ జర్నీ
గతంలో ఒకసారి వీసా రిజెక్ట్ అయిన వారికి విడిగా ఇంటర్వ్యూ స్లాట్లు ఇచ్చే వారనీ, ఇప్పుడు దానిపై నేటికీ క్లారిటీ లేదు. ఇక, హైదరాబాద్ అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం నూతన ప్రాంగణంలోకి మారినప్పుడు వీసా ఇంటర్వ్యూ కౌంటర్ల సంఖ్యను గణనీయంగా పెంచామని అక్కడి అధికారులు ఘనంగా ప్రకటించినా, అందుకు తగిన రీతిలో ప్లానింగ్ లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇకనైనా కాన్సులేట్ అధికారులు దీనిపై స్పందించి, తగినన్ని స్లాట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.