rising cost of elections : ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత కీలక ప్రక్రియ. మనదేశంలో ఐదేళ్లకోసారి ఓటర్లు తమ ప్రతినిధిని ఎన్నుకుంటారు. అయితే, మనదేశంలో ఏటికేడు ఈ ఎన్నికల తీరుతెన్నులు, దానికయ్యే వ్యయాలు పెరుగుతూ పోతున్నాయి. దీని కారణంగా ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారి, పేద, మధ్యతరగతి వర్గాల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేయలేక పోతున్నారు. మనదేశంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో 96.80 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంటే దేశ జనాభాలో 69% మంది అన్నమాట. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో పది శాతానికి సమానం. సుమారు 1.5 కోట్ల మంది ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలు ఈ ఎన్నికల క్రతువును నిర్వహిస్తుండగా, 10 లక్షల పోలింగ్ కేంద్రాల్లోని 55 లక్షల ఈవీఎం యంత్రాలు ఓటర్ల అభిమతాన్ని నిక్షిప్తం చేస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి మన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఎంత సంక్లిష్టమైనదో అర్థమవుతుంది.
ఇక.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు అయ్యే ఖర్చుకు సంబంధించిన గణాంకాల వివరాలకు వస్తే.. 68 దశల్లో 4 నెలల పాటు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు రూ. 10.45 కోట్లు, 2014 నాటి 16వ లోక్‌సభ ఎన్నికలకు రూ.3,870 కోట్లు ఖర్చయినట్లు గతంలో రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడించింది. 1951లో ఒక్కో ఓటర్ మీద ఎన్నికల సంఘం పెట్టిన ఖర్చు 6 పైసలు కాగా, 2014లో అది రూ.46కి పెరిగింది. 2019 ఎన్నికల్లో పాల్గొన్న 32 జాతీయ, ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చు(అధికారికంగా చూపించినది) రూ. 2,994 కోట్లు. ఇందులో రూ.529 కోట్లను ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు నేరుగా అందించాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ సంస్థ తెలిపింది. ఇక, తాజా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు 1.2 లక్షల కోట్ల ఖర్చవుతుందనీ, ఇందులో భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం పెట్టే ఖర్చు 21 శాతం కాగా, మిగిలినది అభ్యర్థి, అతని పార్టీలు వెచ్చించే మొత్తంగా ఉండే అవకాశముందని ఎన్నికల నిపుణులు పేర్కొంటున్నారు.
తొలి సార్వత్రిక ఎన్నికల్లో 401 సీట్లకు 53 పార్టీల తరపున 1,874 మంది అభ్యర్థులు పోటీ పడగా, అప్పట్లో ఈసీ 1.96 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల నాటికి ఎంపీ సీట్ల సంఖ్య 543కి పెరగగా, 673 పార్టీల తరపున 8 వేల మంది బరిలో నిలవగా, 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీల సంఖ్య దాదాపు 2,500కు పెరిగింది. అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య పెరగటం, సంప్రదాయ ప్రచార పద్ధతులకు తోడు కాలానుగుణంగా వచ్చిన డిజిటల్ ప్రచారపు జోరు పెరగటం, ఎన్నికల సిబ్బంది, భద్రతా దళాల రవాణా, పోలింగ్ బూత్‌లను ఏర్పాటు, ఈవీఎంల కొనుగోలు, నిర్వహణ, రాజకీయ పార్టీల ప్రచారం, ఓటుహక్కుపై ఈసీ వివిధ మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం, ప్రతి పార్లమెంటు పరిధిలో 23ఫ్లయింగ్ స్కాడ్స్, 23 స్టాటిస్టికల్ సర్వేయల్ టీమ్‌లు, 9 వీడియో వీవింగ్ టీమ్‌లు, 23 పోలీస్ చెక్ పోస్టుల ఏర్పాటు వంటివి ఎన్నికల ఖర్చు పెరగటానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నా.. గెలుపే సర్వస్వంగా భావించి, అభ్యర్థులు దొంగచాటుగా పంచే డబ్బు, మద్యం, ఇతర తాయిలాలే ఎన్నికల ఖర్చు ఊహించనంతగా పెరగటానికి కారణాలుగా చెప్పటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.25 వేల వరకే ఖర్చు చేయటానికి అనుమతించారు. అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి పది వేల రూపాయలే. 1971లో వ్యయ పరిమితిని అన్ని రాష్ట్రాల్లో రూ.35 వేలకు పెంచారు. 1996లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4.5 లక్షలకు, 1998లో దీన్ని రూ.15 లక్షలకు, 2004లో రూ.25 లక్షలకు అనుమతించారు. 2014 నాటికి లోక్‌సభ అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితిని రూ.70 లక్షలుగా నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో అది పెద్దరాష్ట్రాల్లో రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.75 లక్షలుగా ఈసీ ఆమోదించింది. ఇక, ఎన్నికల నిర్వహణలో భాగస్వాములయ్యే సిబ్బందికి వేతనాలతో పాటు వాలంటీర్లకు పారితోషికం, శిక్షణా తరగతులకు హాజరయ్యే వారికి కరువు భత్యం, ప్రయాణ ఖర్చుల భారమూ ఏటికేడు పెరుగుతూ వస్తోంది. భారత ఎన్నికల సంఘం మార్చి 22, 2024 న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల అధికారికి రోజుకు రూ. 350, పోలింగ్ అధికారులకు రోజుకు రూ. 250, సహాయ సిబ్బందికి రోజుకు రూ. 200 చెల్లిస్తోంది.
ఈ గణాంకాల గొడవ కాసేపు పక్కన బెట్టి, క్షేత్ర స్థాయి వాస్తవాల్లోకి వెళితే, లోక్‌సభకు పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు తన పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ఈ క్రమంలో బూత్‌ల వారీగా కమిటీలు వేసి, అక్కడి కార్యకర్తల ఖర్చులు భరించాలి. ప్రత్యర్థి కంటే తానే బలంగా ఉన్నానని కనిపించేందుకు వందలాది వాహనాలు, వేలాదిగా మందీ మార్బలాన్ని వెంట వేసుకుని ప్రచారానికి వెళ్లాల్సి వస్తోంది. వీరికి ముందుగా సాగిపోయే ప్రచార రథాలు, కళాకారుల ప్రదర్శనలు, ఓటర్లకు అందించేందుకు కరపత్రాలు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు వంటివి ఉండనే ఉంటాయి. ఇక, ప్రాంతాల వారీగా నెల రోజుల ముందే చిన్న చిన్న పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ఇద్దరో ముగ్గురో కార్యకర్తలు రోజంతా కూర్చొని, ఓటర్లను ప్రభావితం చేస్తుంటారు. ఇవిగాక, అభ్యర్థి నామినేషన్‌కు భారీగా జనసేకరణ, తమ పార్టీ నేతల చేత బహిరంగ సభలు, ఆ సభలకు డబ్బు ముట్టజెప్పి తరలించే జనాలు (ఈ ఎండల్లో సభలకు, సమావేశాలకు వచ్చే జనం పెద్ద నోటు లేనిదే రారని సంగతి తెలిసిందే), వారి తిండీ తిప్పలు, రవాణా ఖర్చులు, పార్టీ అధినాయకుడు ప్రచారానికి తరలివస్తే అభ్యర్థి చేసే స్వాగత ర్యాలీలు, ఆ ర్యాలీ రక్తి కట్టటానికి వందలాది యువత ద్విచక్ర వాహనాలతో చేసే హడావుడి, తమ ప్రాంతానికి తరలి వచ్చే ముఖ్య నేతల కోసం ఆధునిక వాహనాల ఏర్పాటు ఇవన్నీ అభ్యర్థి భరించాల్సిందే. ఒకటీ అరా నియోజక వర్గాల్లో మాత్రమే ఆయా పార్టీలు తన వాటాగా అభ్యర్థికి కొంత అందిస్తోంది. ఈ లెక్కన నోటిఫికేషన్ రోజునుంచి ప్రచారం ముగిసే వరకు కనీసం రూ.50 కోట్ల ఖర్చు తప్పదని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు.
డబ్బే ప్రధానమైన కొలబద్ద కావడంతో ధనవంతులైన అభ్యర్ధుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది. 1990-91లో పార్లమెంట్‌లో వ్యాపారవేత్తలు 7.24శాతం ఉంటే 14వ పార్లమెంట్‌లో అది 22.33శాతానికి పెరిగింది. ప్రస్తుత పార్లమెంట్‌లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది. గతంలో పెట్టుబడిదారులు పరోక్షంగా పార్టీలకు అండనిచ్చేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్‌శక్తులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలే నేరుగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు. మరోవైపు, సరళీకరణ విధానాల తర్వాత నయా సంపన్నుల సంఖ్య పెరగడంతో భారీగా ఖర్చు చేయగల డబ్బున్న అభ్యర్ధులకు కొదవ ఉండడం లేదు. రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం లాభార్జనకు సులభ మార్గంగా, అవసరంగా ఈ శక్తులు భావిస్తున్నాయి. బూర్జువా రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగల శక్తినే ప్రధాన కొలబద్దగా పెట్టుకొని అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నాయి. కనీసం పార్లమెంట్‌కి 50కోట్లకు పైన, శాసన సభకు 10కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగే వారినే అభ్యర్ధులుగా ఎంపిక చేస్తున్నారు. అటు, ప్రజలు కూడా వీటికి ప్రభావితులౌతున్నారు. దీని మూలంగా అభ్యర్ధులు అవినీతిపరులైనా, నేరస్తులైనా పట్టించుకోకుండానే ఓటు వేస్తున్నారు. నేరపూరిత చరిత్ర ఉన్నా తమ అస్థిత్వానికి చెందినవాడైతే తమ ప్రయోజనాలకు రక్షణగా ఉంటాడని, అక్రమంగానైనా తమకు మేలు చేస్తాడనీ, ప్రత్యర్ధుల నుంచి కాపాడతాడనీ వారిని కొన్ని సమూహాలు అంగీకరిస్తున్నారు. అందుకే ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998), న్యాయ సంఘం (1999) సిఫార్సుల మేరకు ఎన్నికల వ్యయాన్నంతా కేంద్రమే భరిస్తే, ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని, అదే సమయంలో ప్రజల్లోనూ గొప్ప చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే ఈ ప్రలోభాల పర్వాలు, పరిధి మీరిన ప్రచార పర్వాలకు చెక్ పడుతుందని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అందరికీ అవకాశమొస్తుందని ఎన్నికల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
గోరంట్ల శివరామకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్