- మోడీతో ఢీ అంటే ఢీ అంటున్న తెలంగాణ సీఎం
- జాతీయ స్థాయిలో ప్రధానిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
- రాష్ట్ర బీజేపీ కీలక నేతలను తేలిగ్గా తీసుకున్న సీఎం
- రిజర్వేషన్ల విమర్శలతో ఇరుకున పడ్డ మోదీ
- చేటు తెస్తున్న ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు
- బీజేపీని బ్రిటీష్ జనతా పార్టీగా మార్చేసిన రేవంత్
- ఈస్ట్ ఇండియా దోపిడీదారులతో బీజేపీని పోలుస్తున్న కాంగ్రెస్
- బీఆర్ఎస్ కన్నా బీజేపీనే టార్గెట్ చేసిన తెలంగాణ సీఎం
C.M.Reventh Reddy target BJP in Lok Sabha Elections: మాటల్లో ఫైర్..చేతల్లో షైన్..రోరింగ్ లో లయన్ గా మారి మాటకు మాట, కౌంటర్ కు ఎన్ కౌంటర్, విమర్శలకు ప్రతి విమర్శ అన్నట్లుగా పార్లమెంట్ ఎన్నికల రణరంగంలో పవర్ ఫుల్ అస్త్రశస్త్రాలతీో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలలో కనీసం 10 నుంచి 12 స్థానాలైనా గెలిపించుకోవాలనే కసితో రోజుకు 3 బహిరంగ పభలతో…తన పదునైన మాటలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఒక పక్క అభ్యర్థుల తరపు ప్రచారం చేస్తూనే కేంద్రంలోనూ కాంగ్రెస్ ను అధికార పీఠంపై కూర్చోపెట్టాలనే ఆశయంతో కేంద్ర వైఫల్యాలను తూర్పారబడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ దాడికి వెనుకాడడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముస్లీం రిజర్వేషన్లను తొలగిస్తామని సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా తిప్పికొట్టారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించి.. ఆ పార్టీని ఇరుకున పెట్టారు. అంతేకాకుండా, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అభివర్ణించడమే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో దోచుకోడానికి బీజేపీ కీలక నేతలు వస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో గత పదేళ్ల బీజేపీ పాలనలో తప్పిదాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, తెలంగాణకు ఏమి చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ బీజేపీపై చార్జిషీటు కూడా విడుదల చేశారు.
బీజేపీని కట్టడి చేస్తున్న సీఎం
తెలంగాణను సౌతిండియాకు ‘గేట్ వే’గా మార్చుకోవాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు హాజరవుతున్నారు. తెలంగాణలో ఈసారి సీట్ల సంఖ్యను డబుల్ కంటే ఎక్కువ పొందేలా ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణ భారత్‌లో పట్టు పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే తెలంగాణ నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసుకుంటున్నది. ఎంపీ సీట్ల సంఖ్యనూ పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. పార్లమెంటు ఎలక్షన్ షెడ్యూలు రిలీజ్ కావడానికి ముందే 3 సార్లు స్టేట్‌లో పర్యటించిన ప్రధాని మోదీ మరో మూడు రోజుల పాటు ఐదారు ఎంపీ సెగ్మెంట్లలో జరిగే బహిరంగసభల్లో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీళ్లిచ్చే కౌంటర్లకు ప్రతిగా ఎన్ కౌంటర్ చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎత్తులు సాగనియ్యకూడదని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ను పక్కనబెట్టి బీజేపీపై ఫోకస్
ప్రధాని మోదీకి కౌంటర్‌గా ఆయన స్థాయికి తగినట్లుగా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ లాంటివారిని రంగంలోకి దించే వ్యూహానికి బదులుగా స్వయంగా రేవంత్‌రెడ్డే కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల రిజర్వేషన్ విషయంలో ప్రధాని చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. పదేండ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం..ఇలాంటివాటిలో అన్యాయం చేశారని పలుమార్లు ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయనతోనే తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఎలాగూ బీఆర్ఎస్‌తో పెద్దగా చిక్కులే లేవని ఓపెన్‌గానే చెప్తున్న సీఎం రేవంత్.. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీని కట్టడి చేస్తామన్న ధీమానూ వ్యక్తం చేస్తున్నారు.
పదునైన విమర్శలతో ఎదురుదాడి
రాముడు, దేవుడు, హిందుత్వ అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో హామీల అమలుపై దేవుళ్ల మీద ఒట్టేసి చెప్తూ ఆ దారినే ఎంచుకున్నారు. లోక్‌సభ ఎలక్షన్స్ తర్వాత రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లిపోతారంటూ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పదేపదే కామెంట్ చేస్తున్న సమయంలో మోడీనే టార్గెట్ చేస్తూ బలంగా విమర్శిస్తుండటం గమనార్హం. రిజర్వేషన్ల విషయంలో మోడీ, అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన రేవంత్‌రెడ్డి.. ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని పుల్‌ఫిల్ చేయడానికి బీజేపీ కంకణం కట్టుకున్నదని, దేశవ్యాప్తంగా 400 సీట్లలో గెలిచి రాజ్యాంగంలో సమూల మార్పులు చేసే కుట్ర ఉన్నదంటూ స్వరం పెంచారు. బీజేపీలో మోడీనే రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకుని ఒకే సమయంలో అటు బడే భాయ్.. ఇటు బీజేపీలోకి వెళ్తారనే కామెంట్లకు బ్రేక్ వేస్తున్నారు.