- తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్
- రేసులో సీనియర్ హేమాహేమీలు
- జూన్ నెలాఖరున జరగబోయే స్థానిక ఎన్నికలకు ముందే అధ్యక్షుని ఎంపిక
- పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలలో ముందున్న భట్టి విక్రమార్క
- అధిష్టానం వద్ద మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న భట్టి
- అధ్యక్ష పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఇవ్వానుకుంటున్న అధిష్టానం
- అధ్యక్ష పదవి రేసులో పోటీపడుతున్న మరికొందరు
- సీఎం రేవంత్ మద్దతు ఉన్నవారికే పదవి దక్కే అవకాశం
Reventh ready to resign to PCC president post party seniors hopes on the post:
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రహసనం పూర్తయింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారధిగా ఎవరిని నియమించాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు టీపీసీసీ కొత్త అధ్యక్ష పదవిపై మక్కువచూపుతున్నారు. అందుకే తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. టీపీసీసీ రేసులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తన భార్య కు ఇప్పించుకునే విషయంలో రాజీపడ్డ భట్టి ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. పార్టీలో సీనియర్ నేతలంతా కూడా భట్టికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అధిష్టానం వద్ద వ్యక్తిగత పలుకుబడి కలిగిన నేతగా భట్టికి మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలందరితోనూ భట్టి టచ్ లో ఉన్నట్లు సమాచారం.
జూన్ నెలాఖరులోగా పూర్తి
తెలంగాణలో కీలక ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. జూన్ నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు ఉండటంతో అవి నిర్వహించేలోగా పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుంని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనపడుతోంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అందుకే పీసీసీ అధ్యక్ష పదవి అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం లేకపోలేదు.
షబ్బీర్ ఆలీ, సీతక్క
నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఆశించిన సంపత్ పేరు కూడా తెర వెనుక వినపడుతోంది. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. మధు యాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. మహేష్, అంజన్ కు రేవంత్ మద్దతు ఉంటుంది. రేవంత్ ఎవరిపేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే అవకాశం కనపడుతోంది. మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు వినపడుతోంది. ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క కు అవకాశం ఉంది. ఇక ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రిగా అగ్రకుల (రెడ్డి) సామాజిక వర్గం, డిప్యూటీ సీఎంగా, స్పీకర్‌గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన (భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్‌కుమార్) వ్యక్తులు ఉండటంతో పీసీసీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం సముచితంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. . తనకు సీఎం మద్దతు ఉండటంతో కచ్చితంగా కాబోయే పీసీసీ అధినేత తానేనని మహేశ్‌కుమార్‌గౌడ్ ధీమాగా ఉన్నట్టు సమాచారం.
భట్టికే ఛాన్స్
ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని భావిస్తే భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చు. గతంలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డ భట్టి ఇప్పుడు పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాహుల్‌గాంధీ ప్రచారం నిమిత్తం ఆయన వెంటే ఉంటూ రాయబరేలి ప్రచారానికి వెళ్లిన భట్టి రాహుల్ ను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. అలాగే పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఇటీవల బెంగళూరులో సమావేశమైన సందర్భంగా కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని భట్టి కోరినట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఈ అంశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే భట్టికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా భట్టి విక్రమార్క వైపు మొగ్గు చూపుతుండటంతో ఎక్కవ ఛాన్స్ భట్టికే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.