– అందరివాడుగా మారిన సీఎం రేవంత్ రెడ్డి
– ఎన్నికల ప్రచారం కోసం 7 రాష్ట్రాల నుంచి పిలుపు
– ఇప్పటికే ప్రచారం షురూ చేసిన తెలంగాణ సీఎం
– వయనాడ్‌లో రాహుల్ గాంధీ కోసం ప్రచారం
– పినరయి ప్రభుత్వంపై ఆగ్రహం
– సౌత్ లీడర్‌గా రేవంత్‌కు పెరిగిన ఫుల్ క్రేజ్
Revanth Reddy Turn to Star Campaigner for Congress Party : కాంగ్రెస్ పార్టీలో సౌత్ లీడర్‌గా ప్రమోట్ అవుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఆయన, ఈమధ్య జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో తన విజన్ ఏంటో చెప్పేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హిందీలో స్పీచ్ ఇరగదీయడంతో ఇతర రాష్ట్రాల నేతలు, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా మారారు.
పలు రాష్ట్రాల నాయకులు తమ తరఫున ప్రచారం చేయాలని పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి మద్దతుగా వయనాడ్‌లో ప్రచారం చేశారు తెలంగాణ సీఎం. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్‌పై విరుచుకుపడ్డారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం కుటుంబ పాలన సాగిస్తోందని ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్‌లో సీఎం పినరయి పేరు వినిపించడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రభుత్వం సరైన పాలన అందించడం లేదన్న ఆయన, కేరళ ప్రజల సహకారంతో మిడిల్ ఈస్ట్ దేశాలు డెవలప్ చెందుతున్నాయని అన్నారు. కానీ, కేరళ రాష్ట్రం మాత్రం అభివృద్ది చెందడం లేదని అన్నారు. పినరయ్ విజయన్ అభివృద్దిపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే, ప్రజలు ఉపాధి కోసం మిడిల్ ఈస్ట్ దేశాలకు పోతున్నారని అన్నారు. ప్రధాని మోడీకి విజయన్ పరోక్ష సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.
వయనాడ్‌లో రాహుల్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఏపీ రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు అందాయి. తమ రాష్ట్రాలకు వచ్చి ప్రచారం చేయాలని కోరాయి. తాజాగా గుజరాత్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల నేతలు కూడా రమ్మని పిలిచారు. ఇప్పటికే తెలంగాణలో బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు రేవంత్. ఈనెల 19 నుంచి మే 11 వరకు సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలలో పాల్గొననున్నారు. ఇదే టైమ్‌లో మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతుండడంతో రేవంత్ రెడ్డి సౌత్ లీడర్‌గా ప్రొజెక్ట్ అవుతున్నారనడానికి ఉదాహరణగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.