Neelam Madhu: మెదక్‌లో నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. ఇటు కేసీఆర్, అటు మోడీపై విరుచుకుపడ్డారు. ‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఇంటికి పంపించాం. ఇక మోడీ సంగతి చెప్పాల్సి ఉన్నది. కేంద్రంలో కూడా మోడీని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. పదేళ్లు సీఎంగా కేసీఆర్, పీఎంగా మోడీ ఉన్నారు. వీళ్లు చేసిన అభివృద్ధి, తెచ్చిన పరిశ్రమలు ఏవో చెప్పాలి. ఆ తర్వాతే ఓట్లు అడగాలి’ అని సవాల్ విసిరారు.
‘కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు 1980లో ఇందిరా గాంధీని మెదక్ ప్రజలు పార్లమెంటుకు గెలిపించి పంపించారు. ఆమె మెదక్‌కు BHEL, ODF వంటి అనేక కీలకమైన పరిశ్రమలను తీసుకువచ్చారు. ఆ తర్వాత 1999 నుంచి 2024 వరకు.. 25 ఏళ్లు మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నది. వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆనాడు ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్పితే బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు.’ అని రేవంత్ రెడ్డి వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెదక్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఇక దుబ్బాకలో గెలిచిన తర్వాత రఘునందన్ రావు చేసింది కూడా ఏమీ లేదని ఫైర్ అయ్యారు. దుబ్బాకలో గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెస్తానని చెప్పిన రఘునందనర్ రావు దుబ్బాకలో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని, తాము బస్సులేసుకుని దుబ్బాక వస్తామని, తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని చాలెంజ్ చేశారు. నల్లధనం తెచ్చి ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తానని మోడీ అన్నారని, వేశారా? అని అడిగారు.
కేసీఆర్ పని అయిపోయిందని, కారు కార్ఖానాకు పోయిందని, దాన్ని తుక్కు కింద అమ్మాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు వాస్తవం ఇలా ఉండగా.. పిట్టలదొర కేసీఆర్ ఇంట్లో ఉండే కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. అదేమైనా ఆయన తాగే ఫుల్ బాటిలా ఖాళీ అయిపోవడానికి అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. ‘ఇక్కడున్నది రేవంత్ రెడ్డి. హైటెన్షన్ వైర్. బిడ్డా.. టచ్ చేసి చూడు. మాడిపోతావ్. చూస్తూ ఊరుకోవడానికి నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు. మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఉరికి కొడతాం.. జాగ్రత్త! మేం అవ్వా అయ్యా అని, తండ్రి, మామను చూపి అధికారంలోకి రాలేదు. మీ లాంటోళ్లను తొక్కుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కానీ, వందరోజుల్లోనే మమ్మల్ని దిగిపోవాలని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేం ఇచ్చిన హామీలను బరాబర్ అమలు చేస్తాం. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత మాది’ అని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేడీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహించారు.
Also Read: నీలం మధును గెలిపించాలి.. రాహుల్‌ను ప్రధాని చేయాలి
‘మే అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాం. ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల మేరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. రూ. 22,500 కోట్లతో పేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తున్నాం. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం నింపుతున్నాం. పేదలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం. ఇది ఓర్వలేక కాంగ్రెస్‌ను ఓడించాలని కేసీఆర్, మోడీ కలిసి కుట్ర చేస్తున్నారు’ అని ఆరోపించారు. పంద్రాగస్టులోపు రూ. 2 లక్షలలోపు రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు.
రైతులను మోసం చేసిన వెంకట్రామిరెడ్డి
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రైతుల భూములను గుంజుకున్న దుర్మార్గుడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ రైతుల భూములను గుంజుకున్నారని ఫైర్ అయ్యారు. నిజాంకు ఖాసీం రజ్వీ ఎలాగో.. కేసీఆర్‌కు వెంకట్రామిరెడ్డి గులాంగిరీ అలాంటిదేనని అన్నారు. రైతులను మోసం చేసిన వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే కష్టాలేనని స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండానే అని చెప్పారు. పేదింటి బీసీ బిడ్డ, బడుగు బలహీనవర్గాల నాయకుడు నీలం మధును కాంగ్రెస్ ఎంపీగా గెలిపించాలని కోరారు. రైతుల్ని పొట్టనపెట్టుకున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.