– రేపు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
– అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు పోరాటం
– దళితుల అభ్యున్నతికి కృషి
– బాబూజీ స్ఫూర్తితోనే ప్రజా పాలన
– మహనీయుడి సేవలను గుర్తు చేసిన సీఎం రేవంత్
అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుల్లో స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప రాజకీయవేత్త బాబూ జగ్జీవన్ రామ్ ఒకరు. ఏప్రిల్ 5న ఆయన జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాబూజీ సేవల్ని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 117వ జయంతిని పురస్కరించుకొని బాబూజీ సేవల్ని అందరూ స్మరించుకోవాలని సూచించారు.
అత్యంత పేదరికంలో జన్మించిన ఆయన అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న బాబూజీ రాజ్యాంగ పరిషత్ సభ్యునిగానూ సేవలందించారు. స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారు. దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. రైల్వే, జాతీయ రవాణా శాఖ మంత్రిగానూ తనదైన ముద్ర వేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని అన్నారు సీఎం రేవంత్. ఆయన స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు.
బాబూజీ ప్రస్థానం ఇదే..
బిహార్‌లోని షాబాద్ జిల్లా చందా గ్రామంలో జన్మించారు బాబూ జగ్జీవన్ రామ్. తల్లిదండ్రులు దేవి, శోభిరామ్. తండ్రి బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి తర్వాత రైతుగా స్థిరపడ్డారు. తల్లి నీడలో 1914లో ఆరా అనే పట్టణంలో ప్రాథమిక విద్యను ప్రారంభించారు బాబూజీ. చిన్నతనం నుంచే కుల వివక్షకు గురయ్యారు. 1931లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సాధించారు. దళితుల పట్ల చూపుతున్న వివక్షపై పోరుబాట పట్టారు. దళితులందర్నీ ఏకం చేసేందుకు సామాజిక పోరాట కార్యకర్తగా ప్రజా జీవనంలోకి అడుగు పెట్టారు. 1934లో బిహార్ భూకంపంలో అనేక మందికి సాయం చేశారు. ఆ సమయంలో గాంధీజీని కలిశారు. 1935లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. కాన్పూర్‌కు చెందిన సంఘ సంక్కర్త బీర్బల్ కుమార్తె ఇంద్రాణీ దేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు బాబూ జగ్జీవన్ రామ్. కేంద్రమంత్రిగా పలు హోదాల్లో పని చేశారు.