– రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
– పథకాలకు అర్హుల ఎంపిక అధికారుల చేతికే
– బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలదే రాజ్యం
– సొంత వాళ్లే లబ్ధిదారులు
– ఆ తప్పును రిపీట్ చేయమంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారం చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారింది రేవంత్ సర్కార్. ఓవైపు ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటూనే, ఇంకోవైపు గత ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తోంది. బీఆర్ఎస్ పాలనలో అనుభవాల దృష్ట్యా అప్పటి తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు లబ్ధిదారుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది.
బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందంటే..?
కేసీఆర్ హయాంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఎక్కడైనా లబ్ధిదారుల ఎంపిక అంటే ప్రభుత్వ అధికారుల పాత్రే కీలకం. కానీ, కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేలకు అప్పగించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత బంధు, బీసీ, మైనార్టీల ఆర్థిక సాయం వంటి పథకాల ఎంపిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరిగింది. వారు ఊ అంటే స్కీములో ఉంటారు. ఊఊ అంటే అంతే. ఇదే అదునుగా పార్టీ కార్యకర్తలు, అనుచరులు, బంధువులకు పథకాలలో లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్నారు. కమీషన్ల పేరుతో దండుకున్నారు. దీనిపై ప్రజా వ్యతిరేకత భారీగా వచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పును రిపీట్ చేయమని స్పష్టం చేసింది.
అధికారులకే అన్నీ అప్పగింత!
ప్రజా పాలనలో భాగంగా గ్యారెంటీలను అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ పథకాలకు అర్హుల ఎంపిక మొత్తం అధికారుల చేతుల్లోనే పెట్టింది. అలాగే, ఇందిరమ్మ ఇండ్లు, 500 గ్యాస్ సిలిండర్, పింఛన్లు, ఫ్రీ కరెంట్, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసి సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవాలని భావిస్తోంది. ఈ కమిటీలు క్షత్రస్థాయిలో అధికారులతో కలిసి అర్హులను గుర్తించేందుకు సహకారం అందిస్తాయి. అంతేకాదు, మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పథకాల అమలులోనూ వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.
నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసమే!
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగలేదు. తమకు కావాల్సిన వాళ్లనే ఎంపిక చేసుకుంటున్నారని అసలైన లబ్ధిదారులు రోడ్డెక్కిన పరిస్థితి. అందుకే గత ప్రభుత్వం మాదిరిగా పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలకు అప్పగించొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది.