– ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీ కుట్రలు చెల్లవు
– ఆరునూరైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ
– పాలమూరు రుణం ఎన్నటికీ తీర్చుకోలేను
– ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్ అడ్డా
– కొత్తకోట, ఖమ్మం ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి
revanth reddy fire on modi and kcr : ఢిల్లీ పాలకుల కుట్రలు పాలమూరులో చెల్లవని, వారికి ఇక్కడి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శనివారం సాయంత్రం కొత్తకోటలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి మాట్లాడారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మల్లు రవిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపుదామని ఓటర్లకు పిలుపునిచ్చారు. పాలమూరు బిడ్డనైన తనకు సోనియా గాంధీ అత్యున్నత పదవినిచ్చి గౌరవించారనీ గుర్తుచేశారు.
పాలమూరు బీజేపీ నేత డీకే అరుణ మాత్రం తనపై కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అరుణకు గతంలో మంత్రి పదవిని ఇచ్చింది కాంగ్రెస్సేనని, కానీ, ఆమె నేడు ఢిల్లీలోని బీజేపీ పాలకులకు తొత్తుగా మారారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణ చెప్పుకుంటోందని, ఆమెతో తనకు ఎలాంటి పంచాయితీలు లేవన్నారు. డీకే అరుణ పాలమూరుకు ఏంచేసిందో చెప్పి ఓటు అడగాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేసేందుకు పాలమూరు ఓటర్లు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని, మోదీ, అమిత్ షాతో కలిసి తనను సీఎం కుర్చీ నుంచి దించడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు. డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తున్నారని, మోదీ, అమిత్ షాతో కలిసి తనను సీఎం కుర్చీ నుంచి దించడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
గత అసెంబ్లీ ఎన్నికల వేళ.. వనపర్తిలో గెలుపు కోసం తాను గల్లీగల్లీ తిరిగానని గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 సీట్లకు గానూ 12 సీట్లు ఇచ్చి జనం తనను ఆదరించారని, వారి రుణం తీర్చుకుంటానన్నారు. తాను వారసత్వ రాజకీయాల వల్ల నేడు ముఖ్యమంత్రిగా లేననీ, స్వయంకృషితో ఎదిగినవాడినని గుర్తుచేశారు. పాలమూరులోని కురుమూర్తి స్వామి సాక్షిగా పంద్రాగస్టులోపు2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రమాణం చేశారు. రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా అని, తాను మాటిస్తే తప్పబోనన్నారు. సిద్దిపేటకు హరీశ్ శనిలాగ పట్టారని.. త్వరలోనే రుణమాఫీ చేసి ఆ శనిని తొలగిస్తానని, హరీష్ తన రాజీనామా లెటర్ రెడీగా పెట్టుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డిని, నాగర్ కర్నూలులో మల్లు రవిని లక్ష ఓట్లతో గెలిపించాలని కోరారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నందుకే తనపై ఢిల్లీలో కేసు పెట్టారని, ఢిల్లీలోని మోడీ, గజ్వేల్ కేడీ కలసి ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు.
మరోవైపు శనివారం ఉదయం ఖమ్మం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో ఏర్పాటుచేసిన జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఖమ్మం జిల్లావాసులకు రాజకీయ చైతన్యం ఎక్కువనీ, నాటి వైఎస్ నుంచి నేటి తన వరకు ఖమ్మ రాజకీయాలంటే భయమేనన్నారు. పోరాటాల చరిత్ర గల జిల్లా ఖమ్మానికి చెందని రవీంద్రనాథ్ తొలి తెలంగాణ ఉద్యమానికి పునాది వేశారని, మలి దశ పోరాటంలో పాల్వంచ నుంచే తెలంగాణ నినాదం ప్రపంచానికి వినిపించిందన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కపై రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే భట్టి విక్రమార్క గట్టోడు కాబట్టే జాగ్రత్తగా ఖజానాను నిర్వహిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్.. భాజపాలో చేరతారని మేం మొదటి నుంచి చెబుతున్నాననీ, కేంద్రం చేసిన అన్ని చట్టాలకు గులాబీ పార్టీ మద్దతునిచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారనీ, ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు.