Revanth reddy about farmers(Telangana news today): ధాన్యం కొనుగోళ్ల విషయంలో గతంలో ఎప్పుడూ ఏదో ఒక కిరికిరి ఉండేది. అయితే కేంద్రం కొనకపోవడం.. లేదంటే మధ్య దళారులు చేతివాటం ప్రదర్శించడం తరుచూ కనిపిస్తూ ఉండేది. రెండు పార్టీల మధ్య రాజకీయంతో రైతన్నలు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, తాజాగా జనగామ వ్యవసాయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామం మారిన పరిస్థితులను వెల్లడిస్తున్నది. తేమ, తాలు సాకుతో రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యాపారులు, మిన్నకుండిన అధికారులపై యాక్షన్ తీసుకోవడం అరుదుగా జరుగుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ఇది జరిగింది.
రేయింబవళ్లు కష్టపడి పంటను కంటికి రెప్పలా చూసుకుని.. చివరికి అమ్మకానికి తీసుకువచ్చినప్పుడు వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై తడిగుడ్డతో గొంతు కోసే ఘటనలను రైతన్నలు చెప్పుకుంటూ ఆవేదన చెందుతుంటారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం 250 మంది రైతులు ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చారు. ధాన్యంలో తేమ, తాలు సాకుతో ట్రేడర్లు క్వింటాకు రూ. 1551, రూ. 1569, రూ. 1659 చొప్పున ధర డిసైడ్ చేశారు. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాకు ధర రూ. 2203 నిర్ణయిస్తే రూ. 1500 ఇవ్వడం ఏమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను, వ్యాపారులను నిలదీశారు. లేదంటే తమ ధాన్యాన్ని తగులబెడతామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ వ్యవసాయ మార్కెట్ వచ్చారు. రైతులతో మాట్లాడి జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. అధికారులు ఇచ్చిన చీటీలపై వ్యాపారులు రాసిన ధరలను చూసి షాక్ అయ్యారు. వెంటనే తక్కువ ధరలు నిర్ణయించిన నలుగురు వ్యాపారులపై క్రిమినల్ కేసులు మోపాలని, వెంటనే ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రసాద్‌ను ఆదేశించారు. కనీస మద్దతు ధరతోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అడిషనల్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు స్థిమితపడ్డారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటన పై సకాలంలో స్పందించి… రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై… pic.twitter.com/1XgdaIoc4t
— Revanth Reddy (@revanth_anumula) April 11, 2024
Also Read: మళ్లీ అరెస్టు.. బయటికి రావడం కష్టమే?
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టం చేశారు. ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులతో కుమ్మక్కై ధర తక్కువ చేసే కుట్రకు పాల్పడితే సహించేది లేదని పేర్కొన్నారు. కాగా, సకాలంలో స్పందించిన రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయడం అభినందనీయం అని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌ను సీఎం మెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.