Summer Heat: మే నెల ఎండలు జూన్‌లోనే మొదలయ్యాయనిపిస్తున్నది. జూన్ చివరి రోజున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీలో ఎండలు 46 డిగ్రీలను దాటిపోయాయి. సమ్మర్ పీక్స్‌లో ఈ టెంపరచర్ నమోదవుతూ ఉంటుంది. కానీ, ఈ సారి ఏప్రిల్‌లోనే భానుడు భగభగమండిపోతున్నాడు. నిప్పుల కొలిమిలో ఉన్నామా? అన్నట్టుగా ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే బాదుడు మొదలు పెడుతున్నాడు. 9 గంటలు దాటితే బయట అడుగుపెట్టలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.
తెలంగాణలో జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో 46.2 డిగ్రీలు, కరీంనగర్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాదికి ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు. ఏప్రిల్ మాసంలో ఈ స్థాయి ఎండలు కొట్టడం గత పదేళ్లలో ఇవే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఇక సిద్దిపేట, మంచిర్యాల, ములుగు, జోగులాంబ గద్వాల, నిర్మల్, వరంగల్, జనగామ, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం అసిఫాబాద్, మహబూబాబాద్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 45 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
ఇక హైదరాబాద్‌లోనూ టెంపరేచర్ ఎక్కువ నమోదవుతున్నది. యాకుత్‌పుర ఎస్సార్టీ కాలనీలో 43.2 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. రానున్న మూడు నాలుగు రోజుల వరకే రాజధాని నగరంలోనూ ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి.
Also Read: నేను బతికుండగా అది జరగదు.. రిజర్వేషన్లపై పీఎం కీలక వ్యాఖ్యలు
ఈ సారి వేసవి ఎండలు ముందుగానే మొదలయ్యాయి. గత ఏడాదిలో ఇదే కాలంలో నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చితే ఈ విషయం అర్థం అవుతున్నది. ఎందుకంటే.. ఇదే పీరియడ్‌లో గతేడాది టెంపరేచర్ అటూ ఇటుగా 35 డిగ్రీలు నమోదయ్యాయి. కానీ, ఇప్పుడు ఏకంగా పది డిగ్రీలు అధికంగా నమోదవుతు ఉండటం గమనార్హం.
ఇండిపెండెంట్ వెదర్ ఎక్స్‌పర్ట్ టీ బాలాజీ మరో హెచ్చరిక చేశారు. ఈ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను తాకే అవకాశాలున్నాయని చెప్పారు. ఉదయమే ఎండలు 30 డిగ్రీలకు తగ్గడం లేదని, ఇది వడగాలుల ముప్పును సూచిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌లో ఈ రోజు 43 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేశారు. ఇక తూర్పు, ఈశాన్య రాష్ట్రంలో ముఖ్యంగా.. కోల్ బెల్ట్ ఏరియాల్లో ఈ రోజు టెంపరేచర్ 47 డిగ్రీలకూ చేరుకొవచ్చని పేర్కొన్నారు. మే 2వ తేదీ వరకు వడగాలుల రావొచ్చని, ఆ తర్వాత 6వ తేదీ వరకూ తీవ్రమైన వడగాలులు వచ్చినప్పటికీ కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.