Reactions On MLC Kavitha’s Arrest: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దర్యాప్తు అధికారులను నిలదీశారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ఈడీ, నేడు ఇలా అరెస్టు చేయటం సరికాదని, ఈ అనాలోచిత చర్యకు భవిష్యత్తులో ఈడీ అధికారులు కోర్టుముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
కుట్రతోనే అరెస్ట్: ప్రశాంత్ రెడ్డి
ఉదయం సెర్చి పేరుతో కవిత ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు, సాయంత్రం 5.20కి అరెస్టు చేస్తున్నామని చెప్పటంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్, మోదీ ఛోటే భాయ్, బడే భాయ్ వంటివారని, వారిద్దరూ అనుకునే పార్లమెంటు ఎన్నికల షెడ్యూలుకు ఒకరోజు ముందు కుట్రకు తెరతీశారన్నారు. రాత్రి 8.45కి విమానం టికెట్ కూడా బుక్ చేశామని ఈడీ అధికారులు చెప్పటాన్ని బట్టి, వారు అరెస్టు చేయాలని ముందుగా నిర్ణయించుకునే వచ్చారని తెలుస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్రం కుట్రకు భయపడబోమని, దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
అందుకే కవిత అరెస్ట్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
లోక్‌సభ ఎన్నికల వేళ, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే, గులాబీ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుందని, తద్వారా తెలంగాణలో కనీసం 3 ఎంపీ సీట్లైనా గెలుచుకోవచ్చని ప్రధాని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒకరోజు ముందు ఈడీ అరెస్టు చేయటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో కీలక నేతలను అరెస్టు చేసిన సమయంలో కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.