-అయోధ్య తాళాలు తీయించింది ఆయనే
-రాముడితో రాజకీయం మానుకోండి
-బుల్డోజర్ పాలన మీదే
-మేం గెలిస్తే.. రామాలయంపైకి బుల్డోజర్ అనటం దుర్మార్గం
-దూరదర్శన్‌లో రామాయణ, భారతాలూ మా హయాంలోనే
-ప్రధాని మాటలు ముమ్మాటికీ నియమావళి ఉల్లంఘనే
-మీడియా మీట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
Ram Temple is the initiative of Rajiv Gnadhi: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరాన్ని బుల్డోజర్‌తో కూల్చిపారేస్తారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి మండిపడ్డారు. సమాజంలో అశాంతిని రేపే ఈ వ్యాఖ్యలను తక్షణమే ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తరచూ తన విద్వేష వ్యాఖ్యలతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని, ఈ మాటలు ఆయన స్థాయికి తగవని హితవు పలికారు.
బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవ, సుప్రీంకోర్టు తీర్పుతోనే రామమందిర నిర్మాణం సాధ్యమైందని, రాజీవ్ గాంధీ చనిపోకపోయి ఉంటే, రామమందిరం ఏనాడో పూర్తై ఉండేదని అభిప్రాయపడ్డారు. దేశంలోని హిందువుల మనోభావాలను గుర్తించి, నాడు అయోధ్యలో మూతపడిన రామ్‌లల్లా ఆలయ తాళాలు తీయించినదే రాజీవ్ గాంధీయేనని, అప్పుడు మోదీ ఎక్కడున్నారో తెలియంటూ కౌంటరిచ్చారు. యూపీలో బుల్ డోజర్ పాలన తెచ్చిన ఘనత బీజేపీదేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తోందని, మన సమాజపు బహుళత్వ విలువలను నిలబెట్టేందుకు చివరిదాకా నిలబడుతుందని, ఆరునూరైనా ఈ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి రానుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
1989లోనే శిలాన్యాస్
కాంగ్రెస్ సీఎం బహదూర్ సింగ్ హయాంలో 1989, నవంబరు 9 వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శిలాన్యాస్ (పునాదిలో తొలి ఇటుక పెట్టటం) చేయడం జరిగిందన్నారు. ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీయే నాడు ఆ ఆలయ శంకుస్థాపనకు అనుమతి ఇచ్చారని, రాజీవ్ చొరవను నాడు విశ్వ హిందూ పరిషత్ కూడా మెచ్చుకుందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చుంటే, నాడే రామమందిర నిర్మాణం జరిగేదని, సరిగ్గా ఆ అంశాన్ని బీజేపీ వివాదాస్పదం చేసి దానికి మతం రంగు పులిమిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ మత సామరస్యానికి ప్రతీకనీ, దేశంలో అన్ని మతాల మధ్య సామరస్య భావనకు తమ పార్టీ కృషి చేసిందన్నారు. ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్న కాలంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దూరదర్శన్‌లో రామాయణం, మహాభారతం ప్రసారాలు చేయబడ్డాయన్నారు. ఈ వాస్తవాలను మరుగుపరచి, యువతరం ముందు తానే రామమందిర నిర్మాణానికి కర్త,కర్మ,క్రియ అనే రీతిలో ప్రధాని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయోధ్య రామ్‌లల్లా ఆలయం తాళాలు తొలగించి, తలుపులు తీయించటంలో నాటి కేంద్ర హోం మంత్రి బూటాసింగ్ తీసుకున్న చర్యలను కూడా జీవన్ రెడ్డి ప్రస్తావించారు. కేవలం మోదీ ఒక్కరే దేవుడిని కొలుస్తా అని చెప్పుకుంటే ఎలా అన్నారు.
ప్రజాభిప్రాయానికి విలువేదీ?
తన రాజ్యంలోని ప్రతి పౌరుడి మాటకూ శ్రీరాముడు విలువిచ్చాడని, పదేపదే రాముడి పేరును ప్రస్తావించే ప్రధాని మోదీ పాలనలో ప్రజాభిప్రాయానికి స్థానమెక్కడని జీవన్ రెడ్డి నిలదీశారు. ఇకనైనా ప్రధాని రాముడి మాటకు కట్టుబడాలని సూచించారు. రాముడి పేరుతో ఓట్ల రాజకీయం చేసే బీజేపీ, 1989లో దూరదర్శన్‌లో నాటి రాజీవ్ గాంధీ ప్రసంగాలు వినాలని, కనీసం అప్పుడైనా మత సామరస్యంపై రాజీవ్ గాంధీ ఎంత ఉదాత్తభావాలు గల నాయకుడో అర్థమవుతుందని సూచించారు. ఈ దేశంలో హిందువుల మనోభావాలను గౌరవించిన కుటుంబం గాంధీ కుటుంబమేనని, నేడు ఆ అంశంతో ఫక్తు రాజకీయం చేస్తున్నది బీజేపీయేనన్నారు. కోర్టు తీర్పుతోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిందనీ గుర్తుచేశారు.