- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన రాహుల్ గాంధీ ట్వీట్
- జోడో యాత్ర తర్వాత మారిన రాహుల్ గాంధీ వైఖరి
- సామాన్య జనంతో మమేకమైన రాహుల్
- హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చి ఆర్టీసీ బస్సులో ప్రయాణం
- ఇకపై సిద్ధాంత పరంగా బీజేపీని ఎదుర్కోవాలనే నిర్ణయం
- రాజకీయ ప్రచారాలలో దూకుడు పెంచిన రాహుల్
- రాహుల్ గాంధీ కనుసన్నల్లో నూతనాధ్యాయ దిశగా కాంగ్రెస్ పార్టీ
- జననేతగా రాహుల్ కు పెరుగుతున్న ఆదరణ
Rahul tweet Okka Votu create sensation in political trend Lok Sabha elections:
గాంధీ, నెహ్రూ కుటుంబ వారసుడిగా, సోనియాగాంధీ తనయుడిగా ఒకప్పడు ముద్రపడిన రాహుల్ గాంధీ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఈ ఎన్నికలలో. ఆయన నడక, నడత వేసే ప్రతి అడుగులోనూ జన నాయకుడిగా రాటుదేలుతున్నారు. లారీ డ్రైవర్ల కష్టాలు వింటూ, దారిలో కనిపించే చిన్న దుకాణాలలో టీ తాగుతూ..పొలాలలో రైతులతో కలిసి నాట్లు వేస్తూ..సాధారణ పౌరుడిగా జనంలో కలిసిపోతూ ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ ప్రచార పర్యటనకు వచ్చినప్పుడు కామన్ మేన్ గా టీఎస్ ఆర్టీసీ బస్సులో రేవంత్ రెడ్డితో కలిసి ప్రయాణం చేశారు. ఇవన్నీ రాహుల్ ను ఓ ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయనడంలో సందేహం లేదు. గతేడాది జరిపిన జోడో యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దారిలో కనిపించిన చిన్నారులను భుజాలకెత్తుకుని, అక్కడక్కడా పేదల బస్తీలలో బజ్జీలు, సమోసాలు తింటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు ఒకప్పటి రాహుల్ గాంధీలా కాక ప్రసంగాలలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ‘ఒక్క ఓటు’ట్వీట్ ప్రజలను ఆలోచింపజేస్తోంది.
ఒక్క ట్వీటులో సంచలనం
‘‘దేశవ్యాప్తంగా జరుగుతున్న భయంకరమైన భేదభావాలు, అన్యాయాన్ని నిర్మూలించేందుకు మీ ఒక్క ఓటు చాలు. ఆగస్టు 15 నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కావాలంటే మీ ఒక్క ఓటు చాలు. జులై 1 నుంచి నిరుపేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతినెలా రూ.8500 జమకావాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ఫ్రెషర్లకు ఏటా లక్ష తొలి ఉద్యోగాలు దొరకాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. మీకు అధికారమిచ్చే రాజ్యాంగానికి రక్షణ లభించాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ప్రభుత్వాన్ని ఎన్నుకునే మీ అధికారాన్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే..మీ ఒక్క ఓటు చాలు. అణగారిన వర్గాల వారికి అన్ని రంగాల్లో భాగం దొరకాలంటే, రిజర్వేషన్లకు రక్షణ లభించాలంటే..మీ ఒక్క ఓటు చాలు. జల్, జంగల్, జమీన్‌లపై ఆదివాసీలు అధికారాన్ని కొనసాగించాలంటే.. మీ ఒక్క ఓటు చాలు. ఇండియా కూటమిలోని పార్టీలకు వేసే ప్రతీ ఓటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. పౌరుల వికాసానికి బాటలు పరుస్తుంది’’ అని రాహుల్‌గాంధీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. ఒక్క ఓటు చాలు అనేది ఇప్పుడు ప్రజల గుండెల్లో బలంగా తాకుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటుశక్తి గురించి తెలుపుతూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రజలను ఆలోచింపజేసే ట్వీట్ చేశారు. ‘‘ఒక్క ఓటు’’ అనే పదాన్ని ప్రాస కోసం వాడుతూ.. భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు ఏర్పడితే ప్రజల కోసం ఏమేం చేస్తారనేది సూటిగా సుత్తిలేకుండా ఆయన చెప్పేశారు.
జోడో యాత్రతో పెరిగిన అవగాహన
ఎందుకో ప్రతిసారీ ఎన్నికల సమయంలో రాహుల్ ఎంతగా శ్రమించినా రిజల్ట్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. దీనితో పార్టీలో ఉన్న సీనియర్ న ేతలంతా దూరం కావడంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టారు. కేవలం యాత్రే కాదు ఈ యాత్ర ద్వారా సామ్యవాద,ప్రగతిశీల సిద్ధాంతాలు కూడా పార్టీకి ముఖ్యం అని భావించారు రాహుల్. అందుకే అప్పటి నుండి అంబేద్కరిజం, మార్క్సిజం, బుద్దిజంపై అవగాహన పెంచుకుంటూపోతున్నారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాటిని ప్రజల్లో ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. ఇక భారత్ జోడో యాత్ర.లో రాహుల్ గాంధీ యోగేందర్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, ప్రొ.హరగోపాల్, ప్రొ. కంచ ఐలయ్య, ప్రొ.కోదండరాం లాంటి మేధావులతో పాటు ప్రముఖ జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్ మెరుగుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తెచ్చుకోగలిగింది.
పార్టీకి బలం చేకూర్చే సిద్ధాంతం
సిద్ధాంత పరంగా బలంగా ఉన్న బీజేపీ హిందుత్వ వాదానికి విరుగుడు కనిపెట్టే పనిలో రాహుల్ గాంధీ రహస్య విప్లవ నిర్మాణానికై అన్వేషణ మొదలు పెట్టారు. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి కీలకమైన మలుపుగా భావించవచ్చు. రాహుల్ గాంధీ కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ నూతన రాజకీయ అధ్యాయంలోకి అడుగుపెడుతోంది. ఎప్పటికైనా కాంగ్రెస్‌కి పూర్తిస్థాయి అధికారం కైవసం అవుతుంది అంటున్నారు రాజకీయ పండితులు. దేశ రాజకీయాల్లో భారి అవమానాలు మోసినా, మొక్కవోని దైర్యంతో ముందుకు సాగిన రాహుల్ గాంధీ గొప్ప తత్వవేత్తగా కనిపించే రోజులు సమీపంలో ఉన్నాయి. దేశ రాజకీయాలలో జరుగుతున్న సైద్ధాంతిక పోరులో ఎవరు విజయతీరాలకు చేరుతారో.. బిన్నత్వంలో ఏకత్వం ద్వారా యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా ఉన్న భారతదేశం భిన్న సిద్ధాంతాల ఘర్షణలో ఎవరిది పై చేయి అవుతుందో కాలమే జవాబు చెప్పాలి.