Prajwal Revanna: రాహుల్ గాంధీ తన కర్ణాటక పర్యటనలో బీజేపీపై, నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ కేసును ప్రస్తావిస్తూ మోదీపై నిప్పులు కురిపించారు. ఇది కేవలం సెక్స్ స్కాండల్ కాదని, ఇది ఒక మాస్ రేప్ అని అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ మాస్ రేపిస్ట్ అని, ఆ మాస్ రేపిస్ట్ కోసం ప్రధాని మోదీ ఓట్లు అడిగారని, ఆ మాస్ రేపిస్ట్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్టేనని సభలు, సమావేశాల్లో చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళలను రేప్ చేశాడని, వారి అభ్యంతరకర వీడియోలు తీశాడని తెలిపారు.
రాహుల్ గాంధీ శివమొగ్గలో ర్యాలీలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనమైన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్‌ను ప్రస్తావించారు. ఇలాంటి రేపిస్ట్ కోసం జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుందా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ కోసం క్యాంపెయినింగ్ చేయడమే కాదు, ఆయనను సురక్షితంగా బయటికి దేశానికి పంపించి మోదీ రక్షించారని ఆరోపించారు.
‘వందలాది మంది మహిళలను రేప్ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోకుండా ప్రధాని మోడీ ఆపలేదు’ అని రాహుల్ అన్నారు. ‘ప్రధాని మోదీకి యంత్రాంగమంతా చేతిలోనే ఉన్నది. అయినా.. ఆ మాస్ రేపిస్టు జర్మనీ పారిపోకుండా అడ్డుకోలేదు. మోదీ గ్యారంటీ అంటే ఇదే. వారు అవినీతి కూపంలోని నాయకుడైనా, మాస్ రేపిస్ట్ అయినా బీజేపీ కాపాడుతుంది’ ని విమర్శించారు.
Also Read: Congress Manifesto: తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో
మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి ఎంపీగా గెలిచాడు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ. ఆయన ఫోన్ ద్వారా రికార్డ్ చేయబడిన సుమారు 3000 వీడియోలు పెన్‌డ్రైవ్‌లలో ఉన్నాయని బయటపడింది. వందలాది మంది మహిళలపై అత్యాచారం చేస్తూ వీడియోలు రికార్డు చేశాడని, ఆ సెక్స్ టేప్‌ల పెన్ డ్రైవ్‌లు బయటపడ్డాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో చాలా వరకు వీడియోలు ప్రజ్వల్ స్వయంగా రికార్డు చేసినవే. అవీ తన ఇల్లు, ఆఫీసులో రికార్డు చేసినవని తెలుస్తున్నది.
తొలుత గౌడ కుటుంబం ఈ ఆరోపణలను ఖండించింది. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని పేర్కొంది.
ఈ వ్యవహారం బయటికి రాగానే ఆ వీడియోలన్నీ మార్ఫింగ్ చేసినవని ప్రజ్వల్ రేవణ్ణ కొట్టివేశారు. ఆ తర్వాత ఆయన జర్మనీలని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోయినట్టు తెలిసింది. పార్టీ ఆయనను సప్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణ కోసం దేశవ్యాప్తంగా లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారు.