-కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్
– ప్రజల ఆకాంక్షలనే మేనిఫెస్టోగా తెచ్చామన్న నేత
– 5 కీలక అంశాలపై హామీలను ప్రకటించిన రాహుల్
– కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ గురించీ ప్రస్తావన
– నిరంకుశ శక్తుల నుంచి దేశాన్ని విముక్తం చేద్దామని పిలుపు
– కేంద్రంలో ఇండియా కూటమి విజయం ఖాయం
– కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమన్న సీఎం రేవంత్
– జనసంద్రంగా మారిన తుక్కుగూడ
– సభ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు ఖుష్..
Rahul Gandhi Releases Congress Lok Sabha Election manifesto in Telangana: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ‘జన జాతర’ సభ జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో తుక్కుగూడ మార్మోగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఈ సభా వేదిక నుంచి విడుదల చేశారు. ‘న్యాయపత్రం’ పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో దేశ ప్రజలకు ఐదు ప్రధాన గ్యారెంటీలను ఆయన ప్రకటించారు. మోదీ పాలనలో దగాపడిన మహిళలు, యువత, రైతాంగం, కార్మికవర్గానికి భరోసానిచ్చే వాగ్దానాలతో బాటు సామాజిక న్యాయానికి సంబంధించిన కొన్ని కీలక హామీలను ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ తాము ఇచ్చిన 6 గ్యారెంటీల మేనిఫెస్టోను విడుదల చేసినట్లే.. నేడు జాతీయ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు రాహుల్ వివరించారు. తాము ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామనే సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణలో మాదిరిగా రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే అక్కడా హామీల అమలు జరగనుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ వాణి కాదని, దీనిని యావత్ భారతపు గుండెఘోషగా ఆయన అభివర్ణించారు.
Also Read: లోక్‌సభ చేవెళ్ల సీటు ఎవరి చేతికో?
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్నీ రాహుల్ ప్రస్తావించారు. ‘తెలంగాణ మాజీ సీఎం వేలాది ఫోన్లు ట్యాప్ చేయించి, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను నా దుర్వినియోగం చేశారు. కొందరు అధికారులు ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా హార్డ్‌డిస్క్‌లు నదుల్లో పడేశారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. ఆ మాజీ సీఎం నాడు తెలంగాణలో చేసిన పనే నేడు కేంద్రంలో మోదీ చేస్తున్నారు. దేశంలో మోదీ ఎక్కడకు వెళ్లినా ఆయన కంటే ముందు ఈడీ అధికారులు వెళ్తున్నారు. దేశంలోనే భాజపా అతిపెద్ద వాషింగ్ మెషీన్‌గా మారింది. బీజేపీలో చేరిన అవినీతిపరులంతా స్వచ్ఛ చరితులేనని బీజేపీ చెప్పుకుంటోంది. చివరికి ఎన్నికల సంఘంలోనూ మోదీ చక్రం తిప్పుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల ముచ్చట చూస్తే మోదీ బాగోతం తెలిసిపోతోంది.
కీలక హామీలివే
.యువతకు శిక్షణ, నిరుద్యోగులకు ఏడాదికి లక్ష భృతి
.మహిళల కోసం నారీన్యాయ్ చట్టం, పేద మహిళకు ఏడాదికి రూ.1 లక్ష సాయం
.రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు మద్దతు ధర
.కార్మికులకు రోజుకు రూ.400 కనీస వేతనానికి హామీ, ఉపాధి హామీ వేతనం పెంపు
.బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక బడ్జెట్
.3 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీల భర్తీ
.పేపర్ లీకుల నుంచి విముక్తి, లీకులకు అడ్డుకట్టకు చర్యలు
.యువ కాంతి-యువత కోసం రూ.5 వేల కోట్లతో కొత్త స్టార్టప్ ఫండ్