Congress Rahul gandhi news(Latest political news in India): లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెడుతాయి. ఈ రాష్ట్ర ప్రజలను మెప్పిస్తే కేంద్రంలో అందలాన్ని అందుకోవడం తేలిక. ఎందుకంటే దేశంలో మరే రాష్ట్రంలో లేని, మరే రాష్ట్రం దరిదాపుల్లో కూడా లేనన్ని లోక్ సభ స్థానాలు యూపీలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందుకే ఉత్తరప్రదేశ్‌లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి జాతీయ పార్టీలు ఆరాటపడుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రెండు సార్లు యూపీలోని వారణాసి నుంచి ఎన్నికయ్యారు. అయోధ్య రామ మందిరం మొదలు చాలా అంశాలపై ఇక్కడ బీజేపీ జోరుగా రాజకీయం చేస్తుంది. వాస్తవానికి గాంధీ కుటుంబం కూడా యూపీ నుంచే పార్లమెంటులో అడుగుపెట్టేది. అందులో రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు వారికి కంచుకోటల వంటివి. కానీ, గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయారు. కేరళలోని వయానాడ్ నుంచి గెలిచారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ సారి రాయ్‌బరేలీ సీటును సోనియా గాంధీ వదిలిపెట్టారు. రాజ్యసభకు వెళ్లారు. దీంతో గాంధీ కుటుంబం దాని కంచుకోటలైన అమేథి, రాయ్‌బరేలీని వదిలిపెట్టేసిందా? అనే చర్చ జరిగింది.
వాస్తవానికి లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి గాంధీ కుటుంబం యూపీపైనా ఫోకస్ పెట్టాల్సిందని, రాహుల్ గాంధీ ఎందుకు యూపీ నుంచి పోటీ చేయడం లేదనే ప్రశ్నలూ వచ్చాయి. ఈ ప్రశ్నలకు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్టానం వర్గాలు కీలక సమాచారాన్ని ఇచ్చాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయనున్నట్టు కీలక సమాచారం అందింది. కాంగ్రెస్ వర్గాలు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి సమాచారం అందించినట్టు వార్తలు వచ్చాయి.
Also Read: రిజర్వేషన్లకు రెఫరెండం ఈ ఎన్నికలు
రెండో విడత పోలింగ్(ఏప్రిల్ 26) జరిగిన తర్వాత ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిసింది. రెండో దశ ఎన్నికల్లో కేరళలోని వయానాడ్‌కు పోలింగ్ జరగనుంది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానానికి ఎన్నికలు జరిగిన తర్వాత అంటే మరో ఒకట్రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్ నుంచి రాహుల్ పోటీపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాహుల్, ప్రియాంకలు ఇక్కడి పోటీ చేస్తే నైతికంగా పార్టీకి చెందిన ఇతర అభ్యర్థులకు కలిసి వస్తుందని వాదనలు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులపైనా దీని ప్రభావం ఉంటుంది. అంతేకాదు, దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే.. రాహుల్ గాంధీ భయపడి యూపీ వదిలిపెట్టి పారిపోయారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఒక ధైర్యం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఒకరకంగా బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఢీకొడుతున్న సంకేతాలను ఇస్తాయి.
అమేథీ నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ఇటీవలే రాహుల్ గాంధీని అడిగినప్పుడు పార్టీ ఆదేశిస్తే అందుకు సిద్ధమేనని ఇటీవలే ఆయన స్పష్టం చేశారు.
అయోధ్య రాముడి దర్శనం:
రెండో దశ పోలింగ్ జరిగిన మరుసటి రోజున రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీలు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. 27వ తేదీన వీరు అయోధ్యలో కొలువైన బాలరాముడిని దర్శించుకునే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్రం ఘనంగా నిర్వహించినా.. దాన్ని ఒక రాజకీయ వేడుకగా మలుచుకుందని విపక్షాలు ఆరోపించాయి. అందుకే బీజేపీ రాజకీయ కార్యక్రమానికి తాము వెళ్లడం ఎందుకు అన్నట్టుగా కామెంట్లు చేశాయి. రాముడిపై తమకూ భక్తి ఉన్నదని, వారు పిలిచినప్పుడే వెళ్లాలనేం లేదు కదా.. అంటూ వ్యాఖ్యలు చేశాయి. తాజాగా, రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోనున్నట్టు వార్తలు వచ్చాయి.