– నీట్‌పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్షాలు
– రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామన్న స్పీకర్
– రాహుల్ గాంధీ మైక్ ఆఫ్‌పై వివరణ
– స్పీకర్ తీరుతో వాకౌట్ చేసిన విపక్ష నేతలు
– ఒక రోజంతా నీట్‌పై చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ
– రాహుల్ వ్యాఖ్యలు తప్పన్న మోదీ
– రాజ్యసభలోనూ నీట్ మంటలు
NEET: పార్లమెంట్‌లో నీట్ సెగలు ఇప్పట్లో చల్లారేలా లేవు. సోమవారం సమావేశాలు ప్రారంభమైన కాసపేటికే గందరగోళం నెలకొంది. గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీ-20 ప్రపంచ కప్‌లో గెలుపొందిన టీమిండియా జట్టుకు స్పీకర్ ఓం బిర్లా, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. తదనంతరం నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటామని వెల్లడించారు. రాహుల్ గాంధీ మైక్ స్విచాఫ్ అవడంపైనా వివరణ ఇచ్చారు. స్పీకర్ ఎంత సేపటికీ నీట్‌పై చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అంతకు ముందు రాహుల్ గాంధీ నీట్ వివాదాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ వేదికగా దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు.
వాయిదా తీర్మానం
లోక్ సభ ప్రారంభం కాగానే, కొత్త చట్టాలు, నీట్ పై చర్చకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది కాంగ్రెస్. సభలో ఒక్క రోజు నీట్‌పై చర్చించాలని రాహుల్ పట్టబట్టారు. విద్యార్థులకు సభ నుంచి ఒక్క సందేశం ఇవ్వాలని కోరారు. అయితే నోటీసులిస్తే పరిశీలిస్తామని స్పీకర్ అన్నారు. దీంతో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీట్‌పై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. అయితే, సభా కార్యక్రమాలకు అడ్డుపడడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. స్పీకర్ తీరుకు నిరసనగా కూటమి సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.
సభలో మోదీ వర్సెస్ రాహుల్
చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము ప్రతిపక్షంలో ఉన్నామనే విషయం తెలుసు. అందుకు గర్వపడుతున్నాం. శివుడి ఎడమ చేతి వెనుక త్రిశూల్ ఉంటుంది, అది హింసకు గుర్తు కాదు. హింతకు చిహ్నంగా నిలిస్తే శివుడి కుడిచేతిలోనే ఉండేది. చాలామంది ఒక చిహ్నాన్ని వ్యక్తిరేకిస్తారు. ఆ చిహ్నమే అభయముద్ర. అదే కాంగ్రెస్ పార్టీ గుర్తు. నిజం, హింసను ఎదుర్కోవడానికి అభయముద్ర అవసరం. భయం లేకుండా ఉండేందుకు అవసరం’’ అని అన్నారు. రాహుల్ మాట్లాడుతుండగానే మోదీ మధ్యలో కల్పించుకున్నారు. ఆయన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించడం తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. అమిత్ షా కూడా మాట్లాడుతూ, కోట్ల మంది హిందూవులు గర్వంగా ఉన్నారని, వారిని హింసావాదులుగా రాహుల్ గాంధీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రసంగంలో నీట్, అగ్నివీర్ గురించి ఎందుకు ప్రస్తావన లేదని నిలదీశారు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. పేద విద్యార్థులు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారని తెలిపారు.