Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉన్నదని ఆరోపించారు. తనపై గతంలో ఫిర్యాదు చేసినా ఎవరూ యాక్షన్ తీసుకోలేదని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే రీతిలో వెంకట్రామిరెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి, ఆయన కుటుంబ అక్రమ సంపాదన, రాజపుష్ఫ కన్‌స్ట్రక్షన్స్‌లో పెట్టుబడులు వంటి అనేక అంశాలపై ఇప్పుడైనా ఓ ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమించి దర్యాప్తు జరిపించాలని కోరారు. డీజీపీకి ఇచ్చిన ఈ ఫిర్యాదుకు రాధాకిషన్ రావు, ఎస్ఐ సాయికిరణ్ వాంగ్మూలాలను జతచేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన పోలీసు అధికారి రాధాకిషన్ రావు స్వయంగా తన స్టేట్‌మెంట్‌లో వెంకట్రామిరెడ్డిని ప్రస్తావించారని గుర్తు చేశారు. రాధాకిషన్ రావు వాంగ్మూలంలోని 5, 6, 7 పేజీల్లో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. రాజపుష్ఫా కన్‌స్ట్రక్షన్స్ యజమానులైన వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుల నుంచి డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు రాధాకిషన్ రావు అంగీకరించారని వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన రూ. 3 కోట్లను తరలించినట్టు రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చారని ఫిర్యాదులో రఘునందన్ రావు పేర్కొన్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వెంకట్రామిరెడ్డిపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని అడిగారు. వెంకట్రామిరెడ్డిని ఎందుకు కాపాడుతున్నారని, ఎవరు కాపాడుతున్నారని ఆయన మీడియా ముందు కామెంట్ చేశారు. సామాజిక వర్గం ఒకటే అని సీఎం ఆయనను కాపాడుతున్నారా? అని అనుమానించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని తెలిపారు. తన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.