Raghunandan Rao: మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈ రోజు ఈడీ అధికారులను కలిశారు. మెదక్ లోక్ సభ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్‌లో వెంకటరామిరెడ్డి పేరు వచ్చింది. ఆయన డబ్బులను టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో చేరవేసినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో ఇచ్చారని రఘునందన్ రావు వెల్లడించారు.
రఘునందన్ రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ పత్రాల్లోని వివరాలను ఉటంకిస్తూ మాట్లాడారు. వెంకటరామిరెడ్డి సూచనల మేరకు టాస్క్‌ఫోర్స్ వాహనాన్ని, ఓ ఇన్‌స్పెక్టర్‌ను వారి జాయింట్ ఫ్యామిలీ వెంచర్ రాజపుష్ఫ వద్దకు పంపించినట్టు అంగీకరించారని వివరించారు. ఆ వాహనంలో కోట్లాది రూపాయలను తరలించినట్టు పేర్కొన్నారు. రాజపుష్ప వెంకటరామిరెడ్డి నుంచి కోట్లాది రూపాయలను ఇతర అభ్యర్థులకు తమ టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో చేరవేసినట్టు ఒప్పుకున్నారని వివరించారు.
Also Read: కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోయేది తెలియదు
ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగి ఉంటుందని అన్నారు. వెంకటరామిరెడ్డి ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆధారాలతో తాను ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.
ఇవి తీవ్రమైన ఆరోపణలు అని, ఆయన ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థిగా అనర్హుడని పేర్కొన్నారు.