Radhakishan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం నుంచి వారం రోజులపాటు పోలీసులు రాధాకిషన్ రావును పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో విచారించనున్నారు. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్న విషయంపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఓ ప్రకటన చేశారు.
రాధాకిషన్ రావు నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నదని డీసీపీ తెలిపారు. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులోనూ రాధాకిషన్ కుట్రదారుగా ఉన్నారని చెప్పారు. కొంత మంది ప్రముఖుల ప్రొఫైల్స్ అనధికారికంగా తయారు చేసి అక్రమాలు చేశాడని, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడని వివరించారు. ఒక పార్టీకి డబ్బులు చేరేలా పలువురిని బెదిరించాడని తెలిపారు. కానీ, అసెంబ్లీ ఫలితాలు భిన్నంగా రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడని, ప్రణీత్ రావుకు ఆయన సహకరించాడని పేర్కొన్నారు. పదో తేదీ వరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారిస్తామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు.
Also Read: ఇప్పుడే ఇలా ఉంటే.. మే నెలలో మాడుపగిలేలా?
ఇదిలా ఉండగా మోయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసు మరోసారి ముందుకు వచ్చింది. 2022లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలతో సంచలన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన నందకుమార్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసి అప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ కోణంలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. మోయినాబాద్ కేసులోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందా? అనే చర్చ మొదలైంది. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేశారు. ప్రభుత్వమే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసిందనే విషయం సంచలనమైంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీని పక్కాగా ఇరికించేలా ప్లాన్ చేశారని, అదంతా ఫోన్ ట్యాపింగ్‌తో సాధ్యమైందని తాజా ఆరోపణలతో అర్థం అవుతున్నది.