– మందకృష్ణ బీజేపీ లీడర్‌లా మాట్లాడుతున్నారు
– పదేళ్లు వర్గీకరణ కోసం ఏం చేశారు?
– జాతి ప్రయోజనాల గురించి ప్రశ్నించాలనుకుంటే ముందు మోడీని నిలదీయాలి
– డీకే అరుణ తరం ముగిసింది
– గద్వాలలో జలదీక్షకు వస్తే నడిగడ్డ పౌరుషం ఏంటో చూపిస్తాం
– సంపత్ కుమార్ హెచ్చరిక
మహబుబ్ నగర్, స్వేచ్ఛ: బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు చరమగీతం పాడిన ప్రజలు, ఆ పార్టీని ఎక్కడా కనిపించకుండా చేస్తారన్న నమ్మకం ఉందన్నారు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. సొంత నియోజకవర్గంలో 7 గంటలపాటు ఒక ముఖ్యమంత్రి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం ఎక్కడా చూడలేదన్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, సీఎం సొంత జిల్లాలో తనకు పార్లమెంట్ ఇంఛార్జిగా ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీలు వేసి పని విభజన చేస్తూ క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు కాంగ్రెస్ పాలసీలను తీసుకెళ్తున్నట్టు తెలిపారు. దేవుడి దయ వల్ల పాలమూరు బిడ్డ సీఎంగా ఉన్నాడని, భారీ మెజారిటీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించేందుకు సమీక్షా సమావేశం నిర్వహించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలు నిలవాలని కోరారు. ఇక, మందకృష్ణ మాదిగ కామెంట్స్ పై స్పందించిన సంపత్, తమ జాతి వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తామని, కాకపోతే ఆయన తీరు సరిగ్గా లేదన్నారు. ఆయన ఎంఆర్పీఎస్ నాయకుడిగా తక్కువగా, బీజేపీ నాయకుడిగా ఎక్కువగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. ఆయన మాదిగ జాతికోసం పని చేస్తే 10 సంవత్సరాలు ఎందుకు వర్గీకరణ జరగలేదని అడగలేదన్నారు. అతి త్వరలో తెలంగాణలోని మాదిగ జాతికి సీఎం రేవంత్ రెడ్డి గౌడ్ ఫాదర్‌గా రాబోతున్నారని చెప్పారు. జాతి ప్రయోజనాల గురించి ప్రశ్నించాలి అంటే మందకృష్ణ ముందు నరేంద్ర మోడీని ప్రశ్నించాలని హితవు పలికారు. ఇటు, పశ్చాత్తాపంతో కూడిన నైరాశ్యంలో డీకే అరుణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు సంపత్ కుమార్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ గ్రామ నాయకురాలిగా మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. మహబూబ్ నగర్ రాజకీయాల్లో ఆమె అరిగిపోయిన ల్యాండ్ ఫోన్ రికార్డ్ లాంటి వారన్నారు. మీ తరం పోయింది.. రేవంత్, సంపత్ తరం రాబోతోందని తెలిపారు. గద్వాలలో జలదీక్ష చేసేందుకు వస్తే నడిగడ్డ పౌరుషం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు సంపత్ కుమార్.