Revanth Reddy: తాండూరు ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తెలుగులో తీసిన త్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచప్రసిద్ధిగాంచిందని, ఆ సినిమా చూశారా? అంటూ అడిగింది. మనకు డబుల్ ఆర్ ఉన్నారని, ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ అని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పాలన సమర్థవంతంగా సాగుతున్నది, ప్రకటించిన గ్యారెంటీలు అమలవుతున్నాయని వివరించారు. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ.. సోనియ గాంధీతో ఇక్కడి ప్రజల అనుబంధాన్ని గుర్తు చేశారు. అదే విధంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సంపన్నుల సంక్షేమాన్ని కోరుతుందని, మోదీ పాలనలో కోటీశ్వరులకు వికాసం జరిగిందని అన్నారు. పేదలు, కర్షకులు, కార్మికులు దగాపడ్డారని ఆవేదన చెందారు.
తెలంగాణలో సిలిండర్ రూ. 500కే అందిస్తున్నదని, అదే యూపీలో రూ. 1200కు అందిస్తున్నదని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ ధరలను నియంత్రించడం లేదని మండిపడ్డారు. పదేళ్లలో బీజేపీ ధనవంతుల కోసమే పని చేసిందని ఆగ్రహించారు. మహిళలు, వెనుకబడిన వర్గాలు, కార్మికులు, పేదల కోసం ఏమీ చేయలేదని అన్నారు. సామాన్యులపై పన్నులు పెరుగుతున్నాయని, కానీ, ధనవంతులపై మాత్రం పెరగవని చెప్పారు. సంపన్నుల రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని మండిపడ్డారు. పంటనష్టపోయిన రైతులకు సహాయం అందడం లేదని, సంక్షేమ పథకాలు, రుణమాఫీ కేంద్రం నుంచి రాలేదని వివరించారు. చిన్నచిన్న వ్యాపారులకూ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని, నోట్ల రద్దుదతో రైతులు, చిన్నవ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని పేర్కొన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నదని, ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు పెరిగినా నియామకాలు చేపట్టడం లేదని ఆగ్రహించారు. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
Also Read: Revanth Reddy: వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ కావాలంటే.. కాంగ్రెస్ రావాలి
దేశంలో విమానాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్, నౌకాశ్రయాలను పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లో పెడుతున్నారని ప్రియాంక మండిపడ్డారు. అదానీ, అంబానీల పన్నులు ప్రజలపై వేస్తున్నారని అన్నారు. దేశంలోని సంపద అంతా ఇద్దరు.. ముగ్గురు ధనవంతుల చేతుల్లోకి వెళ్లుతున్నదని వివరించారు. దేశంలోని మీడియా సంస్థలు ఇద్దరి ముగ్గురి చేతుల్లోకి వెళ్లాయని, వాస్తవాలు ప్రజల చెంతకు చేరడం లేదని తెలిపారు. నల్లధనం తీసుకువస్తానని చెప్పిన మోదీ.. ఎలక్టోరల్ బాండ్‌లతో అసలైన అవినీతికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. మోదీ హయాంలో కోటీశ్వరులకు వికాసం జరిగిందని పేర్కొన్నారు.
ఇందిరా గాంధీకి మీరంతా ప్రేమను పంచారని, సోనియా గాంధీని సోనియమ్మ అని పిలుచుకుని తల్లి పాత్ర ఇచ్చారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ధర్మ పథంలో నడవాలని హిందూ ధర్మం నేర్పుతుందని, సత్యం అహింస అన్న సిద్ధాంతాలను గాంధీజీ జీవితాంతం ఆచరించారని, తనువు చాలించేటప్పుడూ హే రామ్ అనే పలికారని వివరించారు. ఏ ధర్మమైనా సత్యమార్గంలో నడవాలనే బోధిస్తుందని, కానీ, ఈ బీజేపీ ధర్మం పేరిట అన్నదమ్ముల విభేదాలు సృష్టిస్తున్నదని ఆగ్రహించారు. పదేళ్లు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం మోదీకి లేదని, అందుకే కన్నీళ్లు పెట్టుకుని నాటకమాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి తప్పా తాను చేసిందేమో చెప్పడం లేదని తెలిపారు.