Priyanka Gandhi: బీజేపీ ఆదివారం మ్యానిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప్ పత్ర్ పేరిట విడుదల చేసిన ఈ మ్యానిఫెస్టోలో మరో ఐదేళ్లకు ఉచిత రేషన్ బియ్యం పథకాన్ని కొనసాగిస్తామని బీజేపీ ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ పథకం కిందికి ట్రాన్స్ జెండర్‌లను తెస్తామని, ముద్ర యోజన కింద రూ. 10 లక్షల లిమిట్‌ను రూ. 20 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. కోట్ల కుటుంబాల కరెంట్ బిల్లు సున్నాం చేస్తామని, విద్యుత్ నుంచి గొప్ప అవకాశాలను సృష్టిస్తామని తెలిపింది. సోషల్, డిజిటల్, ఫిజికల్ మార్గాల్లో 21వ శతాబ్దంలో భారత పునాదిని పటిష్టం చేస్తామని వివరించింది. ఈ సంకల్ప్ పత్ర్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఘాటైన విమర్శ చేశారు. ప్రియాంక గాంధీ కూడా బీజేపీపై విమర్శలు సంధించారు.
ఎక్స్ వేదికగా ఆమె బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రకటించింది కేవలం తీర్మాన లేఖ మాత్రమేనని, అది కేవలం ప్రదర్శన కోసమేనని ఆరోపించారు. వారి అసలు మ్యానిఫెస్టో రాజ్యాంగ లేఖను మార్చడమేనని తెలిపారు. బీజేపీ నాయకుల ప్రసంగాల్లో బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని మార్చడం గురించి తరుచూ ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కుట్రలన్నీ అట్టడుగు స్థాయి నుంచి బీజేపీ పార్టీ ప్రారంభించినవేనని ఆరోపించారు. తొలుత అగ్రనాయకులు ప్రజల ముందు రాజ్యాంగంపై ప్రమాణం చేసినా.. రాత్రికి రాత్రే రాజ్యాంగ ధ్వంస రచనకు సిద్ధమవుతారని వివరించారు. పూర్తి అధికారం దక్కిన తర్వాత రాజ్యాంగంపై దాడి చేస్తారని జోస్యం చెప్పారు.
Also Read: బీజేపీ మ్యానిఫెస్టోపై ఖర్గే ఏమన్నారు?
దేశంలో కోట్లాది మందికి గౌరవప్రదంగా జీవించే హక్కును మన రాజ్యాంగం కల్పించిందని ప్రియాంక గాంధీ తెలిపారు. అందుకే మనమంతా ఏకమై భారత రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ మిషన్‌ను తిరస్కరించాలని ప్రియాంక గాంధీ పిలుపు ఇచ్చారు.