Priyanka Gandhi: ఎన్నికల బాండ్ల స్కీమ్ అక్రమం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులో గోప్యత వహించరాదని, ఏ పార్టీకి ఎన్ని విరాళాలు అందాయో తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని స్పష్టం చేసింది. వెంటనే ఎస్బీఐని విరాళాలకు సంబంధించిన జాబితాను బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఈ జాబితాలు విడుదలయ్యాక అవినీతిపై చర్చ ఉధృతంగా సాగింది. ఎన్నికల వేళ మరోసారి ఎన్నికల బాండ్లపై చర్చ జరుగుతున్నది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ ఎలక్టోరల్ బాండ్లను ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.
పార్టీలకు విరాళాలు అందించే వ్యవస్థను తాము పారదర్శకం చేశామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. ‘మరి.. ఈ రహస్య విరాళాల విధానాన్ని ఎవరు తీసుకువచ్చారు? నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తెచ్చింది కదా..! అందుకే కదా వాటిని పారదర్శకం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ చిట్టా బయటపెట్టడానికి కూడా అధికారులు వెనుకాముందాడితే వెంటనే బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ జాబితా చూస్తే అవినీతిపరులు ఎవరో స్పష్టమవుతుంది. ఆదాయం కంటే కూడా చందాలు ఎక్కువ కట్టిన కంపెనీలు ఉన్నాయి. గుజరాత్‌లో వంతెన కట్టిన కంపెనీ కూడా చందా ఇచ్చింది. ఇక కొందరు చందా కట్టిన తర్వాత వారిపై ఉన్న కేసులు పోతాయి. ఇంతకంటే అవినీతి ఏమున్నది? ఎలక్టోరల్ బాండ్లతో రాజకీయ పార్టీలకు చందాలను పారదర్శకం చేశామని చెబుతున్నారు గానీ.. వాస్తవానికి ఈ విధానం ద్వారా అవినీతి వ్యవస్థనే సృష్టించారు కదా’ అని ప్రియాంక గాంధీ నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ కేసులో మామిడికాయల కథ!
రాజకీయ వ్యవస్థను క్లీన్ చేయడానికి ఎలక్టోరల్ బాండ్ల విధానం సహాయం చేస్తుందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఎం నరేంద్ర మోడీ వివరించే ప్రయత్నం చేశారు. ‘అసలు ఎన్నికల బాండ్లు లేకుంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లుతున్నాయని చూసే అధికారం ఎవరికి ఉంటుంది? ఇదే ఎలక్టోరల్ బాండ్ల సక్సెస్ స్టోరీ. వీటి ద్వారా డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తున్నాయో తెలుస్తుంది’ అని నరేంద్ర మోడీ అన్నారు.
ఈ వ్యాఖ్యలు చేసిన మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఎన్నికల బాండ్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. ఇది రౌడీలు చేసే వసూలు తరహాలోనే ఉన్నదని అన్నారు. సుప్రీంకోర్టు ఈ విధానం అక్రమం అని స్పష్టం చేసినా.. మోడీ మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ విధానం ద్వారా బీజేపీ వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూలు చేయడానికి, క్విడ్ ప్రో కోకు ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.