Praneet Rao Case For Illegal Posting : ప్రణీత్ రావు.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు రీసౌండ్ ఇస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆధారాలు దొరక్కుండా హార్డ్ డిస్కులు ధ్వంసం చేసినట్టుగా తేల్చారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అడ్డదారిలో ప్రమోషన్
కేసీఆర్ ప్రభుత్వంలో నలుగురు అధికారులకు అడ్డదారిలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కార్‌కు ఫిర్యాదు చేశారు డీఎస్పీ గంగాధర్. ఆ నలుగురు అధికారుల్లో ప్రణీత్ రావు పేరు కూడా ఉంది. గతంలో మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇచ్చేవారు. ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయలేదు. అయినా అతడికి డీఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం తమకు కావలసిన వారికి నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు గంగాధర్. నలుగురు అధికారుల ప్రమోషన్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జూబ్లీహిల్స్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్.. ముందే చెప్పిన ‘స్వేచ్ఛ’
జూబ్లీహిల్స్ అడ్డాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడించిందని ముందు నుంచీ ‘స్వేచ్ఛ’ చెబుతూ వస్తోంది. ఇప్పుడదే నిజమైంది. ఈ కేసును జూబ్లీహిల్స్ ఏసీపీకి బదిలీ చేస్తూ ఉమ్మడిగా సిట్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రానుంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తదుపరి విచారణ కొనసాగనుంది. పోలీసుల అదుపులో ఉన్న ప్రణీత్ రావు నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ అడ్డాగానే ట్యాపింగ్ కథంతా నడిపించారని తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని కీలక నేతకు సంబంధించిన భవనంలో స్కెచ్ గీసినట్టు సమాచారం. ఓ ఛానల్ ను అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది ముఠా. అందుకే జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు ఏసీపీకి బదిలీ చేస్తూ సిట్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు.
సిట్‌కు ఆధారాలు ఇవ్వనున్న ‘స్వేచ్ఛ’
ప్రతిపక్ష నేతల ఫోన్లతోపాటు సొంతింటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఇబ్బంది పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమందిని దొంగల లిస్టులో చేర్చి వారి లొకేషన్‌ను కూడా ట్రాక్ చేసినట్టు భావిస్తున్నారు. ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఈ కేసుపై కీలక సమాచారం సేకరించింది. ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నెంబర్లను దొరకబట్టింది. ఈ లిస్ట్‌తో పాటు అన్ని ఎవిడెన్స్‌లు ‘స్వేచ్ఛ’ చేతిలో ఉన్నాయి. త్వరలోనే ఈ ఆధారాలను సిట్‌కు అందించనుంది ‘స్వేచ్ఛ’.
అసలేం జరిగింది..?
కేసీఆర్ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేశాడు దుగ్యాల ప్రణీత్ రావు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశాడు. దీనిపై ఈమధ్యే చర్యలు తీసుకోవడంతో సస్పెన్షన్ వేటు పడింది. ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ కార్యాలయంలోని రెండు రూముల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్ రావు అనధికారికంగా ఉపయోగించుకొని రహస్య సమాచారాన్ని సేకరించినట్టు గుర్తించారు. కొన్ని కంప్యూటర్లలో కీలక రికార్డులను కూడా మాయం చేసినట్టు తెలిసింది. ఇదంతా గతేడాది డిసెంబర్ నాలుగో తేదీన ధ్వంసమైనట్టు గుర్తించారు. దీంతో అతడిపై ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపీపీ, ఐటీ యాక్ట్‌ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, జూబ్లీహిల్స్ అడ్డాగానే ఇదంతా నడిపినట్టు పోలీసులకు తెలియడంతో కేసును అక్కడికే ట్రాన్స్ ఫర్ చేసి సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు.