– రేవంత్ లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్
– దీనికోసమే ఇజ్రాయెల్ నుంచి పరికరాల కొనుగోలు
– హవాలా ముఠాలతో ప్రణీత్ రావు లావాదేవీలు
– ఎలక్టోరల్ బాండ్లు కొనాలంటూ వ్యాపారులపై ఒత్తిడి
– సినీ నటుల వ్యక్తిగత జీవితాల్లోకీ దూరిన వైనం
– ఎర్రబెల్లికోసం స్త్రీనిధి సొమ్ముతో ఏకంగా ట్యాపింగ్ సెంటర్
– బదులుగా ఐటీ మేనేజర్ వేణు ప్రసాద్‌కు సెక్రటేరియట్‌లో పదవి
– బక్కా జడ్సన్ ఫిర్యాదులో మరిన్ని సంచనల విషయాలు
Praneet Gang Who Looted Crores : తెలంగాణ పోలీసులు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అనేక ఊహకు అందని వాస్తవాలు బయటికి రావటంతో విచారణ అధికారులు విస్తుబోతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల మేరకు ఫోన్ ట్యాపింగ్ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) డీఎస్పీ ప్రణీత్ రావు, అతని బృందం స్వామి కార్యంతో బాటు స్వకార్యమూ చక్కబెట్టుకుందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు కార్యకలాపాలను పసిగట్టేందుకు వాడే అత్యాధునిక పరికరాలను విదేశాల నుంచి తెప్పించి వాటి సాయంతో స్థిరాస్తి వ్యాపారులు, హవాలా వ్యాపారులు, సినీ నటులు, రాజకీయ వేత్తలను టార్గెట్ చేసుకుని, వందల కోట్ల ఆర్జనే లక్ష్యంగా పనిచేసింది.
హవాలా మనీయే లక్ష్యం
తమ ప్రణాళికలో భాగంగా ప్రణీత్ రావు బృందం రోజువారీగా హవాలా మార్గంలో డబ్బు, బంగారం చేరవేసే ముఠాల మీద కన్నేసింది. వారి ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వింటూ, హటాత్తుగా దాడిచేసిన పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. లెక్కలో లేని ఆ సొమ్ము గురించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయటానికి వారు ముందుకు రారు గనుక, వారిని బెదిరించి అందినకాడికి ఈ బృందం దండుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో 40 రోజుల వ్యవధిలో పోలీసులు సుమారు రూ. 350 కోట్ల నగదు, 300 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ లావాదేవీలు, నగదు తరలింపు వ్యవహారాన్ని ప్రణీత్ రావు టీం పెద్ద ఆదాయవనరుగా మార్చుకున్నారనే ఆరోపణలూ రావటంతో, గత అసెంబ్లీ వేళ పట్టుబడిన హవాలా వ్యాపారులను ఇప్పుడు పోలీసులు పిలిపించి విచారించనున్నారు.
రేవంత్ కోసం ఇజ్రాయెల్ నుంచి డివైజ్
నాడు విపక్షంలో రేవంత్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ప్రణీత్ రావు టీం పనిచేసింది. ప్రైవేటు దందాలతో పోగుచేసిన సొమ్ముతో, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రవిపాల్ అనే టెకీ సాయంతో ఇజ్రాయెల్ నుంచి రూ. 30 కోట్ల విలువైన నిఘా పరికరాలను కొనుగోలు చేసిన నాటి ఉన్నతాధికారులు.. రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ఆయన ప్రతికదలికనూ గమనిస్తూ వచ్చారు. ఆ పరికరం సాయంతో 300 మీటర్ల మేర గల ఫోన్లు, కంప్యూటర్లలోని సమాచారాన్ని ప్రణీత్ రావు బృందం కాజేసింది. రోజూ రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడిన మాటలను ట్యాప్ చేసి, రోజువారీగా బాస్‌లకు చేరవేశారు. దీనికోసం రవిపాల్‌కు నిఘావిభాగంలో కన్సెల్టెంట్ అనే పోస్ట్ క్రియేట్ చేయటంతో బాటు పెద్దమొత్తాలు ముట్టజెప్పారు. ఈ నేపథ్యంలో రవిపాల్‌ను దర్యాప్తు అధికారులు విచారించనున్నారు.
అమెరికా నుంచి వచ్చిన టీమ్
ఒకేసారి వేలాది ఫోన్లను ట్యాప్ చేసేందుకు కూడా నిఘా విభాగపు పెద్దలు వ్యూహాలు రచించారు. దీనికోసం నల్గొండకు చెందిన పోలీసు అధికారి శ్రీనివాస్ నాయకత్వంలో ఓ బృందం పనిచేసింది. వీరు అమెరికా నుంచి 40 మంది సైబర్ నిపుణులను పిలిపించి కొందరికి అందులో శిక్షణ ఇప్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు, ప్రముఖులు, వ్యాపారుల.. ఇలా ఒకే సమయంలో వేలాది ఫోన్లలోని డేటా కాజేశారనే వివరాలూ విచారణలో బయటికి వస్తున్నాయి.
Read More: దయలేని దయాకర్ రావు..!
బలవంతగా ఎలక్టోరల్ బాండ్స్!
ప్రణీత్ రావు బృందం హైదరాబాద్‌లో వజ్రాలు, స్థిరాస్తి, ఫార్మా, సాఫ్ట్‌వేర్ రంగాలకు చెందిన 36 మంది ఫోన్లను ట్యాప్ చేసి, వారిని పిలిపించి, వారు మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్‌లను వారి ముందుంచి అందిన కాడికి దండుకుంది. అంతటితో వదలిపెట్టకుండా, అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు కొని అందివ్వాలని హుకుం జారీ చేసింది. ఈ క్రమంలో వందల కోట్ల రూపాయల నిధులు అధికారిక పార్టీకి వచ్చేలా చేసింది.
సినీ నటులనూ వదల్లే..
ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే క్రమంలో ప్రణీత్ రావు బృందం..సినీ ప్రముఖులనూ వదిలిపెట్టలేదు. టాలీవుడ్‌లో మంచి పేరున్న ఓ ప్రముఖ నటి ఫోన్‌నూ టాప్ చేశారనీ, కొత్తగా పెళ్లయిన ఆ నటి వ్యక్తిగత వివరాలను బయట పెట్టటం వల్లనే ఆమె వివాహబంధం విచ్ఛిన్నమైందనే వార్తలూ వినవస్తు్న్నాయి.కొందరు సినీ నటులు నగదు రూపంలో తీసుకుంటున్న భారీ పారితోషికాలు, వారి వ్యాపార వివరాలు, విపక్ష పార్టీల నేతలతో వారి సంభాషణల వివరాలను ప్రణీత్ రావు బృందం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు చేరవేసినట్లు సమాచారం.
బంధువులనూ వదలని సర్కారు పెద్దలు
ప్రణీత్ రావు కొనుగోలు చేసిన పరికరాల ఉచ్చులో ఎంపీ సంతోష్, కేసీఆర్ కుమార్తె కవిత, హరీష్ రావు కూడా చిక్కుకున్నట్లు తాజాగా వెల్లడయింది. 2019-20లోనే హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని, అయితే, దీనిని హరీష్ దీనిని పసిగట్టటంతో తర్వాత వెనక్కి తగ్గారని తెలుస్తోంది. కానీ, అదే హరీష్ రావు తర్వాతి రోజుల్లో తన ప్రత్యర్థుల కోసం ప్రణీత్ రావు బృందం సేవలను వాడుకున్నారనీ తెలుస్తోంది. అలాగే కవిత ఫోన్ ట్యాపింగ్ చేసిన కారణంగా చాలాకాలం కేటీఆర్‌తో ఆమెకు దూరం పెరిగిందనీ, ఇదే బాటలో ఎంపీ సంతోష్ రావు నెట్‌వర్క్‌నూ ప్రణీత్ రావు బృందం ఫాలో అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
బాక్స్ ఐటెం బక్కా జడ్సన్ ఫిర్యాదులో మరిన్ని పేర్లు
మరోవైపు సామాజిక కార్యకర్త, ఏఐసీసీ సభ్యుడు బక్కా జడ్సన్ గతంలో పోలీసు కమిషనర్‌కి ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంలోని స్త్రీ నిధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ జి. విద్యాసాగర్ రెడ్డి, ఆ సంస్థలోని ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ ప్రభుత్వ అవసరాల కోసం వేర్వేరు నెట్‌వర్క్‌లకు చెందిన 4 లక్షల సిమ్ కార్డులతో బాటు 30 వేల ట్యాబ్‌లు, 5 వేల కంప్యూటర్లు, ప్రింటర్లు కొన్నారని, ఈ క్రమంలో వేర్వేరు టెలికాం సంస్థల వారిని మచ్చిక చేసుకుని వందలమంది ఉద్యోగుల, డ్వాక్రా బృందాల మహిళా నేతల ఫోన్లను ట్యాప్ చేసి, వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని జడ్సన్ తన ఫిర్యాదులో ఉదహరించారు. వేణు ప్రసాద్ సేవలకు మెచ్చిన ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అతడికి సచివాలయంలో డైరెక్టర్‌గా నియమించారని పేర్కొన్నారు.
Read More: ఎమ్మెల్సీ ఉపఎన్నిక వార్
కరుడుగట్టిన నేరస్తులు దేశం దాటిపోయేందుకు కూడా ఈ ముఠా సహకరించిందని కూడా జడ్సన్ తన లేఖలో ఆరోపించారు. గల్ఫ్ ప్రాంత దేశాల నుంచి డ్రగ్ మాఫియాలు యధేచ్ఛగా ఇక్కడ దందాలు చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన వ్యక్తి లోపాయికారీగా సాయమందించారనీ, స్త్రీనిధి సహకార సంఘం నిధులతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఫోన్ ట్యాపింగ్ కోసం పాలకుర్తిలో ఓ డేటా సెంటర్‌నే ఏర్పాటు చేశారని, ఈ సెంటర్‌లో కావలసిన పరికరాలను స్త్రీనిధి సంస్థ డైరెక్టర్ జి. విద్యాసాగర్ రెడ్డి, సంస్థ ఐటీ మేనేజర్ వేణు ప్రసాద్ సాయంతో ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. గత ఐటీ శాఖా మంత్రి అమెరికా, కెనడా, యూకే, సింగపూర్, మధ్య ఆసియా దేశాల్లో మనీలాండరింగ్ చేసే వ్యక్తులతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పరచారని, ఈ వివరాలన్నీ నాటి సీఎంకు తెలిసే జరిగాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
–దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)