– ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం
– దుబాయ్‌లో చక్రం తిప్పుతున్న ప్రభాకర్ రావు
– విచారణకు రావాలా? వద్దా?
– వస్తే ఏం జరుగుతుంది..?
– సైలెంట్‌గా యూకే చెక్కేస్తే ఏమవుతుంది?
– తెలిసిన లాయర్లు, లీడర్లతో చర్చలు
– సుప్రిమో డీటెయిల్స్ బయటకు రాకుండా ప్లాన్స్
– ట్రీట్ మెంట్ పేరుతో మాల్యా మాదిరిగా యూకేలోనే మకాం!
– పోలీసుల కస్టడీలో రాధా కిషన్ రావు
– వేణుగోపాల్ రావుతో కలిసి విచారణ జరగనుందా?
– ‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో మొదట్నుంచి వినిపిస్తున్న పేరు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. కానీ, ఈయన సైలెంట్‌గా విదేశాలకు చెక్కేశారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ నేపథ్యంలో అందుబాటులోకి రాలేకపోతున్నానని ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే, ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్‌లో ఈయన దుబాయ్‌లో ఉన్నట్టు తెలిసింది. అక్కడ కీలక చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
లాయర్లతో మంతనాలు
కేసులో ప్రధాన పాత్రధారి ప్రభాకర్ రావు అని పోలీసులు చెబుతున్నారు. ఆయన అమెరికాలో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చేస్తున్నారని ప్రచారం సాగింది. కానీ, కొన్ని గంటలకే అంతా తూచ్ అని తేలింది. మరో 3 నెలలపాటు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన దుబాయ్‌లో మకాం వేసినట్టు తెలిసింది. అక్కడ పలువురు లాయర్లు, లీడర్లతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ రావాలా వద్దా? వస్తే అరెస్ట్ చేస్తారా? సుప్రీం, హైకోర్టులో పిటిషన్లు వేస్తే ఎలా ఉంటుంది? ఇలా అనేక కోణాల్లో ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.
యూకేకు జంప్ అయ్యే ఛాన్స్!
ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పీకల్లోతులో మునిగిపోయారు. ఆయన నగరానికి వస్తే అరెస్ట్ కావడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్లాన్ బీ ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం. దుబాయ్ నుంచి సైలెంట్‌గా యూకేకు చెక్కేయాలనే ప్లాన్‌లో ప్రభాకర్ రావు ఉన్నారని తెలుస్తోంది. ట్రీట్ మెంట్ పేరుతో అక్కడకు వెళ్లి విజయ్ మాల్యా మాదిరిగా సెటిల్ అయిపోవాలని చూస్తున్నారని సమాచారం. పైగా, ఇక్కడికి వస్తే సుప్రిమో డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది. అందుకే, ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, సంపాదించిన ఆస్తి అంతా దుబాయ్‌కి చేరవేసినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు, ప్రభాకర్ రావుకు తెలిసిన బడా లీడర్ల బినామీ ఆస్తులు కూడా దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.
తొలిరోజు రాధా కిషన్ రావు విచారణ
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధా కిషన్ రావు స్టేట్మెంట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి రాగా, పోలీసులు ఆయన్ను గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. వారం రోజులపాటు పోలీసులు ఆయన్ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. ఈయన 300 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఆస్తులన్నీ బినామీల రూపంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిమ శ్రీనివాసరావుతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలకు టాస్క్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచి రాధా కిషన్ వారి వ్యవహారాలు చక్కబెట్టి భారీగా పోగేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో డీలింగ్స్ చేసిన ప్రైవేట్ కంపెనీల వ్యవహారాలపై దృష్టి సారించారు.
వేణుగోపాల్ రావు కూడా
ట్యాపింగ్ కేసులో కొత్తగా వేణుగోపాల్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఈయన్ని బుధవారం సిట్ అదుపులోకి తీసుకుంది. పోలీసులు వేణుగోపాల్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఆయన నేరం అంగీకరించడంతోనే అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, వేణుగోపాల్ రావును రాధా కిషన్ రావును కూర్చోబెట్టి విచారణ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు పోలీసులను అప్రూవర్‌గా మార్చుకుని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలనే ఉన్నతాధికారులపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు.
– దేవేందర్ రెడ్డి చింతకుంట్ల (సీనియర్ జర్నలిస్ట్)