Postal ballet votes rules and regulations given election commission:
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. కాగా ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడంతో ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల అధికారి సీల్ లేకపోయినా సదరు బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.
బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకున్నా..
పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై అధికారి సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించ రాదని ఈసీ ఆదేశించింది. ఫాం 13 ఏలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ పంపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. జూన్ 4వ తేదీన ఆయా జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 38 వేల 865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. తర్వాత స్థానంలో నంద్యాల జిల్లా ఉంది. ఇక్కడ 25 వేల 283 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేశారు. మూడో స్థానంలో కడప జిల్లా నిలిచింది. ఇక్కడ 24 వేల 918 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. అత్యల్పంగా నరసాపురంలో 15 వేల 320 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోల్ అయ్యాయి