Telangana Minister Ponnam Prabhakar Use his vote by travel in ts rtc bus:
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 17 లోక్ సభ, ఒక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలలో పోలింగ్ ప్రారంభం అయింది. ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఉదయమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు త్వరత్వరగా చేరుకుని ఓట్లేసి వెళుతున్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు కావడంతో తమ ఓటును వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ సెలబ్రిటీలు, సామాన్యులు, క్రీడా సెలబ్రిటీలు విధిగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ ఓటేసి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్, మాజీ సీఎం కేసీఆర్ చింత మడకలో, కిషన్ రెడ్డి కాచిగూడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అందరిలా కాకుండా తన ప్రత్యేకత చాటుకున్నారు. పోలింగ్ కేంద్రానికి సామాన్య ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో వెళ్లి మరీ ఓటేసి వచ్చారు. కాగా పొన్నం ప్రభాకర్ ఓటు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంది. అక్కడ తన ఓటును వేయడానికి ఆర్టీసీ బస్సులో వెళ్లి తన సింప్లిసిటీని చాటారు.
స్వేచ్ఛగా ఓటెయ్యండి
ఓటు వేసిన అనంతరం పొన్నం మాట్లాడుతూ.. భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కును వినియోగించుకున్నానని, అలాగే బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఓటు అనే ఆయుధం ద్వారా విధిగా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ప్రతి పౌరుడు ఓటు వేసి బాధ్యతతో ఉండాలని అన్నారు.