Congress: పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ పోరుబాట పట్టారు. కరీంనగర్‌లోని ఇందిరా భవన్‌లో ఆయన నిరసన దీక్షకు కూర్చున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పది సంవత్సరాలు తెలంగాణకు చేసిన అన్యాయాలు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు సహా కేంద్రం ఆచరిస్తున్న ప్రజా వ్యతిరేక అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్షకు కూర్చున్నారు. నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఈ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఒడితల ప్రణవ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Also Read: ‘అసలు మ్యానిఫెస్టో రాజ్యాంగాన్ని మార్చడం’
అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయమే హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో ఒక రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన బాధ్యత నెరవేరుస్తానని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారత దేశానికి దిక్సూచీ అని వివరించారు. సామాజిక న్యాయం రావాలని రిజర్వేషన్లు పెట్టారని, సమాన ఓటు హక్కును కల్పించి సమసమాజ ఏర్పాటుకు దారి వేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు అంబేద్కర్ జయంత్యుత్సవాలను జరుపుకున్నారు.